Revanth Reddy: కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి -తెలంగాణ సిఎం

Revanth Reddy: కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి  -తెలంగాణ సిఎం
X
వీలైనంత త్వరగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరుకున్నారు. బాత్రూమ్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడిన సీఎం.. కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. వారి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని అన్నారు. కేసీఆర్‌ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. కాగా కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్‌ అలీ కూడా ఉన్నారు. వారి కంటే ముందు మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా సీఎంను పరామర్శించి వెళ్లారు.


కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్‌ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపించారు.కాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కేసీఆర్‌కి తుంటి నొప్పి తగ్గిందని రోజంతా విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ అంబులేషన్ మార్గదర్శకాల ప్రకారం హిప్ రీప్లేస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని 12గంటల లోపు నడిపించాలని అందులో భాగంగానే కేసీఆర్ శనివారం కొంత సమయం నడిచారని వైద్యుల బృందం తెలిపింది. ఆర్థోపెడిక్ సర్జన్ ఫిజియోథెరపీ బృందం పర్యవేక్షణలో కేసీఆర్ నడిపించామని చెప్పారు.

Tags

Next Story