AP: కోడి పందేల్లో చేతులు మారిన వేల కోట్లు

AP: కోడి పందేల్లో చేతులు మారిన వేల కోట్లు
X
కార్లు, ఇంటి, పొలం కాగితాలు తాకట్టు పెట్టి పందేలు... మూడు రోజుల్లోనే వేల కోట్ల పందెం

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పండగ మూడు రోజులూ కోట్లకు కోట్లు చేతులు మారాయి. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. కార్లు, ఇంటి, పొలం కాగితాలు తాకట్టు పెట్టి మరీ పందేలు కాశారు. కోడిపందేలు మాటున పెద్ద ఎత్తున కోతముక్క, ఇతర జూదాలు నిర్వహించారు. రాత్రివేళ జూదరులను ఆకర్షించేందుకు ఛీర్‌గర్ల్స్‌ను ఏర్పాటు చేశారు.


కార్పొరేట్ స్థాయిలో కోడి పందేలు

ఏపీలో కోడి పందేలకు తోడు కోత ముక్క, గుండాట వంటి జూదాలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. రాత్రిపూట కూడా పందేలు నిర్వహించేలా ఫ్లడ్‌లైట్ల వెలుగులు, గెలుపోటములపై అనుమానాలు తలెత్తకుండా టీవీ రీప్లేలు, జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్ల బందోబస్తుతో బరులన్నీ కార్పొరేట్‌ స్థాయిలో ఏర్పాటు చేశారు. మద్యం, మాంసాహార విందులతో పాటు మహిళా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. క్యాసినో తరహాలో జూదమాడించారు.

కోడి పందాలలో జబర్దస్త్ నటుల సందడి

సంక్రాంతి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేల సందడి కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖులు కూడా ఈ పందాలను తిలకించేందుకు చేరుకుంటున్నారు. పోలవరం నియోజకవర్గంలో నిర్వహించిన కోడి పందాలను చూసేందుకు జబర్దస్త్ నటీనటులు హాజరయ్యారు. ఎమ్మెల్యే చిర్రీ బాలరాజుతో కలిసి జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్, మరికొందరు మహిళా నటులు కోడిపందాలను వీక్షించి సందడి చేశారు.

కోడిపందేలలో గెలిచిన యువకుడికి బుల్లెట్ బైక్

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరు గ్రామంలో నిర్వహించిన కోళ్ల పందాల నిర్వాహకులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది పందేలు నిర్వహిస్తే ఐదు పందేలలో విజయం సాధించిన వారికి బుల్లెట్ ను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భీమవరానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఐదు పందాలు గెలిచి బుల్లెట్ ను దక్కించుకున్నాడు.

Tags

Next Story