TG: కలెక్టర్ పై దాడి కేసు..19 మందికి భూమే లేదు

తెలంగాణలో లగచర్లలో అధికారులపై దాడి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఏ1గా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఉన్నారని వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ తెలిపారు. లగచర్ల ఘటనలో మొదట 47 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో 16 మందిని రిమాండ్‌కు తరలించామన్నారు. బుధవారం మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. మిగతా వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అధికారులను తప్పుదోవ పట్టించిన సురేశ్‌పై గతంలో కేసులున్నాయని వెల్లడించారు. ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి అసలు భూమే లేదన్నారు. కొందరికి భూమి ఉన్నా.. భూసేకరణ పరిధిలోకి రాదని ఐజీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని... నిందితులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించామన్నారు. చాలామంది రైతులను విచారించి వదిలిపెట్టామని ఐజీ సత్యనారాయణ తెలిపారు.
పట్నం నరేందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
బీఆర్ ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం అతనికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
లగచర్లలో ఉన్నతాధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కేటీఆర్, భారాస ముఖ్యనేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. నరేందర్‌రెడ్డిని బుధవారం కొడంగల్ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. సురేశ్ అనే వ్యక్తి కలెక్టర్ సహా ఇతర అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడని చెప్పారు. కలెక్టర్ వెళ్లిన సమయంలో అందరూ ఒకేసారి గుమిగూడారని.. ఆయన వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారని తెలిపారు. కలెక్టర్ కారు దిగి వారి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుండగానే.. దాడి చేసి వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు. ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వెంకట్ రెడ్డికి మంత్రుల పరామర్శ
దాడి ఘటనలో గాయపడిన కొడంగల్ అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబులు పరామర్శించారు.ఎల్బీనగర్ - బైరాముల్ గూడ లోని లక్ష్మీ నరసింహ కాలనీలోని వెంకట్ రెడ్డి నివాసంలో పరమార్శించారు. దాడి ఘటన కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఘటన జరిగిన రోజున వికారాబాద్ కలెక్టర్ పైన, వెంకట్ రెడ్డిపైన లగచర్ల ఫార్మా కంపనీ బాధితులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధితుడు వెంకట్ రెడ్డి వివరించారు. పారిపోతున్న తనని తరిమికొట్టడంతో గాయాలపాలయ్యానన్నారు. అక్కడే ఉంటే తన ప్రాణాలకు ప్రమాదమని తలచి తాను పొలాల మీదుగా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నానని వెంకట్ రెడ్డి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com