Vijayawada : విజయవాడ ఆస్పత్రిలో చంద్రబాబు, వాసిరెడ్డి పద్మ మధ్య వాగ్వాదం

Vijayawada : విజయవాడలో సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు... మహిళా కమిషషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలు, ఆమె తల్లి సమక్షంలోనే వీరిద్దరూ ఒకరిపై మరొకరు కేకలు వేసుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ రాగా... అప్పటికే అక్కడికి చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాగోలా వారిని దాటుకుని వాసిరెడ్డి పద్మ లోపలికి వెళ్లగా... ఆమె తిరుగు పయనం కాకముందే అక్కడికి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని వాసిరెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. తాము కూడా బాధితులకు అండగా నిలుస్తున్నామని, నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని పద్మ బదులిచ్చారు.
ఇలా చంద్రబాబు.. వాసిరెడ్డి పద్మల మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. అక్కడికి వచ్చిన టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ... వాసిరెడ్డి పద్మపై విరుచుకుపడ్డారు. ఇద్దరు మహిళా నేతలు ఒకరిపై ఒకరు వేళ్లు చూపించుకుంటూ వాదులాటకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన చంద్రబాబు... అనురాధను సంయమనం పాటించాలంటూ సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com