Congress: గెలుపు గుర్రాలపై కసరత్తు

శాసనసభ ఎన్నికల్లో పోటీకి దింపే తమ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపుగుర్రాలను గుర్తించేందుకు సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం దిల్లీ పార్టీ వార్‌రూంలో.. మురళీధరన్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 12 గంటల వరకు కొనసాగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న, ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాల జాబితాను తయారు చేసి.. కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు.
ఎలాంటి వివాదాలు లేని జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మధిర నుంచి భట్టి విక్రమార్క, ములుగు - సీతక్క, భద్రాచలం- పొదెం వీరయ్య , మంథని - శ్రీధర్‌బాబు, సంగారెడ్డి - జగ్గారెడ్డి పేర్లతోపాటు కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి, హుజూర్‌నగర్ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితానే కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే.. కొన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం, ఒకే అభ్యర్థి ఉన్నా.. ఇంకా మెరుగైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకరికంటే ఎక్కువ ఆశావహులు పోటీ పడే నియోజకవర్గాలపై.. శుక్ర, శనివారాల్లో కొనసాగే భేటీల్లో నిర్ణయం తీసుకుంటారు. సాధ్యమైనంత త్వరలోనే తొలి జాబితాను అందిస్తామని.. మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారు దిల్లీలో మకాం వేశారు. కమిటీ సభ్యుల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమను నమ్ముకొన్న వారికి టికెట్లు ఇప్పించేందుకు మరికొందరు నేతలు దిల్లీకి వచ్చారు. బీసీ కోటాలో సీట్లు ఇవ్వాలని పలువురు నాయకులు ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలను కలిసి విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు చేసుకున్న నేతల పూర్తి సమాచారం తమ వద్ద ఉందని.. ఎవ్వరూ దిల్లీ రావొద్దని మాణిక్ రావ్ ఠాక్రే సూచించారు. మధుయాస్కీగౌడ్‌పై ఎల్బీనగర్ కాంగ్రెస్ నేతలు దిల్లీలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్, స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడైన మధు యాస్కీకి తమ నియోజకవర్గం టికెట్ ఇవ్వవద్దని విన్నవించారు. ఆయన నిజామాబాద్‌కు రెండుసార్లు ఎంపీగా చేశారని... అక్కడే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసుకోవాలని సీనియర్ నేతల వద్ద సూచించినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com