Nitin Gadkari: ఏపీలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం

రూ.1,046 కోట్ల నిధులతో ఏపీలో జాతీయ రహదారులపై చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏపీలో వంతెనల నిర్మాణాల పురోగతిపై ఆయన వివరాలు తెలియజేశారు.
ఎన్‌హెచ్ - 216ఏ పై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తెతలి, కైకరం వద్ద నిర్మిస్తున్న ఐదు వంతెనలు 2025 ఏప్రిల్ 2నాటికి పూర్తి అవుతాయని తెలిపారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6నాటికి, విశాఖపట్నం ఎయిర్ పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ 2025 ఫిబ్రవరి 15కి, ఎన్‌హెచ్ - 16పై గొలగపూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్‌లో నిర్మిస్తున్న రెండు వంతెనలు 2025 సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఎన్‌హెచ్ 16పై నాగులుప్పలపాడు గ్రోత్ సెంటర్, రాజుపాలెం జంక్షన్ వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణాలకు అనుమతి ఉత్తర్వులు ఇచ్చామని, ఇదే జాతీయ రహదారిలో రాజుపాలెం క్రాస్ రోడ్డు, జొన్నతాళి క్రాస్ రోడ్డు, చెవ్వూరు క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్‌తో పాటు ఎన్‌హెచ్ - 44 పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణానికి బిడ్లు పిలిచామని వివరించారు. ఎన్‌హెచ్ 16లో శ్రీసిటీ జీరో పాయింట్, చిల్లకూరు సెంటర్ వద్ద తలపెట్టిన వంతెన నిర్మాణాలకు బిడ్లు పిలవాల్సి ఉందని గడ్కరీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com