Contract Workers Protest : కదం తొక్కిన కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు..

Contract Workers Protest : కార్మికుల ఆందోళనలతో ఏపీ అట్టుడుకుపోయింది. విశాఖలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు నిరసన గళమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆరు ప్రధాన డిమాండ్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వేలాది మంది కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రభుత్వంపై సీఐటీయూ నేతలు, కార్మికులు మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు.
ఏలూరులో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. జూట్ మిల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలంలో కార్మికులను జగన్ విస్మరించారంటూ మండిపడ్డారు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్. తక్షణం ఉద్యోగులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీగా చేరుకున్న కార్మికులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. కనీస వేతనం 26 వేల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు శ్రమకు తగ్గ వేతనం చెల్లించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 60 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారని అన్నారు కార్మిక సంఘాల నేతలు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com