పిల్లలనూ వదలని కరోనా మహమ్మారి..

పిల్లలనూ వదలని కరోనా మహమ్మారి..
కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. పెద్దలకే కాదు పిల్లలనూ వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి. మొదటి దశలో పసివాళ్లను ఏమీ చేయలేని కరోనా రెండో దశలో మాత్రం పగబడుతోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. పెద్దలకే కాదు పిల్లలనూ వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి. మొదటి దశలో పసివాళ్లను ఏమీ చేయలేని కరోనా రెండో దశలో మాత్రం పగబడుతోంది. మొదటి దశలో కరోనా ప్రభావం కనిపించకపోవడానికి కారణం వాళ్లలో ఉండే రకరకాల టీకాల ప్రభావమేనని సైంటిస్టులు తేల్చారు. కానీ ఇప్పుడలా కాదు. మరింత శక్తివంతంగా తయారైన కరోనా వైరస్... పిల్లలపైనా ప్రభావం చూపుతున్నట్లు చిన్నపిల్లల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు విశాఖలో పెరిగినట్లు చెప్తున్నారు. రోజుకు 10 కేసుల వరకు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెప్తుండడంతో తల్లిదండ్రులకు టెన్షన్ పట్టుకుంది.

కరోనా మహమ్మారి రూటు మార్చింది. దీని లక్షణాలు కూడా మారాయి. ఇదివరకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు వచ్చేవి. కానీ ఇప్పుడు తలనొప్పి, నీరసం, తల తిరగడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పిల్లల్లో తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దని పిల్లల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్లకంటే తక్కువ వయసు వారికి ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి వైరస్‌ వ్యాపిస్తోందని వైద్యులు అంటున్నారు. పిల్లలకూ కరోనా సోకుతున్నా... తీవ్ర అనారోగ్య సమస్యలు కనిపించకపోవడం కాస్త ఊరటనిస్తోంది. మూడు నాలుగు రోజుల్లోనే లక్షణాలు తగ్గిపోయి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పిల్లల పరిస్థితి కూడా దారుణంగా ఉంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సోకిన పిల్లల్ని లక్షణాల్ని బట్టి మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌ అని మూడు రకాలుగా విభజిస్తారు. వీటిని బట్టి ట్రీట్‌మెంట్ అందిస్తారు. జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి, ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోలేక పోవడం వంటి లక్షణాలుంటే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలంటున్నారు. ఇలాంటి కేసుల్లో ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చంటున్నారు. ఇక తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలకు కంటిన్యూయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెజర్‌ విధానంలోగానీ, వెంటలేటర్‌పైనగానీ చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదృష్టావశాత్తు తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story