25 March 2021 6:00 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో కరోనా...

ఏపీలో కరోనా విజృంభణ..నెలలో కోటిమందికి పైగా వ్యాక్సిన్ వేయాలని టార్గెట్

గడిచిన 24 గంటల్లో కొత్తగా 585 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా విజృంభణ..నెలలో కోటిమందికి పైగా వ్యాక్సిన్ వేయాలని టార్గెట్
X

ఏపీలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 585 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో అత్యధికంగా 128, గుంటూరులో 99, విశాఖ 81, కృష్ణా 63, తూర్పుగోదావరి 42, అనంతపురం 36, కర్నూలులో 35 కేసులు వచ్చాయి. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 95వేల121కి చేరింది. ఇందులో 8లక్షల 84వేల 978 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,946 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నలుగురు కరోనా బారినపడి చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7,197కు పెరిగింది.

కరోనా కేసులు ఎక్కువగా పాఠశాలలు, కాలేజీల్లో నమోదవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం ముండూరులో ఐదుగురు, ఏలూరు రూరల్‌ మండలంలో ఎనిమిది మందికి.. విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు కరోనా సోకింది. ఇటీవల తిరుపతిలోని వేద పాఠశాల విద్యార్థుల్లో 60 మందికి వైరస్‌ సోకిగా.. తాజాగా రాజమహేంద్రవరంలోని ఓ జూనియర్‌ కాలేజీలో 150 మందికిపైగా విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం విద్యార్థుల వల్లనే వ్యాప్తి చెందాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నెలలో కోటిమందికి పైగా వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ పెట్టారు. ఎన్నికలు కూడా పూర్తైనందున వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామీణ ప్రాంతాల్లో వారంలో నాలుగు రోజులు మండలాల్లో, రోజుకు రెండు గ్రామాల్లో వ్యాక్సిన్ వేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసినందున పట్ణణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు.


Next Story