కరోనా కారణంగా వీధుల్లో తిరిగి చీపుర్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు

కరోనా కారణంగా వీధుల్లో తిరిగి చీపుర్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు

కరోనా చాలా మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ మాయదారి మహమ్మారి వల్ల సామాన్యుడు రోడ్డున పడ్డాడు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసిన కరోనా.. ముఖ్యంగా నెల జీతాలపై ఆధారపడ్డవారి జీవితాలను తలకిందులు చేసింది. కరోనా వల్ల మూతపడిన పాఠశాలలు.. ఇప్పటికీ తెరుచుకోకపోవడంతో ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. నేటి విధ్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. బతుకుబండి లాగలేక దిగాలుగా ఉన్నారు. 6 నెలలుగా జీతాల్లేక విలవిలలాడుతున్నారు. వీరిపై ప్రభుత్వం కనికరం కూడా లేదు. కరోనా వల్ల స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో విశాఖ జిల్లాలో టీచర్లు రోడ్డున పడ్డారు. నెల జీతంతోనే వారి కుటుంబ పోషణ ఉండేది. అలాంటిది ఇప్పుడు జీతాలు లేక.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కోటపాడుకు చెందిన ఉపాధ్యాయుడు సాంబశివ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో హిందూ పండిట్‌గా పని చేస్తున్నారు. కరోనా వల్ల స్కూల్‌ మూతపడడంతో.. యాజమాన్యం జీతాలు చెల్లించలేని పరిస్థితి. దీంతో సాంబశివ సొంతూరు వెళ్లిపోవాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం ఇంటి వద్దే కూరగాయలు, చీపుర్లు అమ్ముతున్నారు. ఇంటి వద్ద కూరగాయలు విక్రయిస్తూ.. వీధుల్లో తిరిగి చీపుర్లను అమ్ముతున్నారు. స్కూల్‌లో పాఠాలు చెప్పిన పంతులు.. ఇప్పుడు వీధుల్లో చీపుర్లు అమ్మడం పలువురిని కలచివేస్తోంది. ఐతే.. బతుకు బండి లాగాలంటే ఏపనైనా చేయక తప్పదంటున్నారు.

సమాజంలో గురువుల పాత్ర ఎంతో కీలకం. ఐతే.. ఇప్పుడు గురువులకే కష్టాలు రావడంతో వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇన్నాళ్లూ గౌరవంగా జీవించిన కొందరు ఉపాధ్యాయులు కూరగాయలు అమ్ముకోవడం.. చిన్నచిన్న పనులు చేస్తూ బతుకు బండి లాగడం నిజంగా కలచివేసే అంశమే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులను ఆదుకోవాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story