భార్యాభర్తలిద్దరూ ఒకేసారి..

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి..
అయిన వాళ్లెంత మంది ఉన్నా అమ్మానాన్న తరవాతే కదా అని స్థానికులు సైతం ఈ హఠాత్ పరిణామానికి కంట తడిపెడుతున్నారు.

ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇరవైయేళ్లు కలిసి కాపురం చేశారు. చూడముచ్చటైన వారి దాంపత్యాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. ఇద్దరూ గంటల వ్యవధిలో గుండెపోటుతో కన్నుమూశారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఉన్న డిగ్రీ చదువుతున్న కుమారుడు అమ్మానాన్న ఒకేసారి తనువు చాలించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఒంటరిని చేసి వెళ్లారని కృంగిపోతున్నాడు. అయిన వాళ్లెంత మంది ఉన్నా అమ్మానాన్న తరవాతే కదా అని స్థానికులు సైతం ఈ హఠాత్ పరిణామానికి కంట తడిపెడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అద్దంకి మనోహర్ (56), భార్య సూర్యప్రభావతి (48)లు ఎస్. కోట పట్టణంలో స్థానిక పందిరప్పన్న కూడలిలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనోహర్ ఎస్. కోట ఎల్‌ఐసీ కార్యాలయంలో డీఓగా విధులు నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల కిందట ఎస్. కోట వచ్చి సొంత ఇంటిని నిర్మించుకున్నారు. వీరికి డిగ్రీ చదువుతున్న కుమారుడు రామ్ లిఖిత్ ఉన్నాడు. శనివారం రాత్రి 1.30 సమయంలో భార్య ప్రభావతి బాత్రూమ్‌కి వెళ్లి అక్కడే పడిపోయింది.

వెంటనే గమనించిన భర్త.. కొడుకు సహాయంతో 108 ఫోన్ చేశారు. క్షణాల్లో చేరుకున్న సిబ్బంది అప్పటికే ప్రభావతి మరణించినట్లు నిర్ధారించారు. భార్య మరణవార్తను కుటుంబసభ్యులకు చేరవేస్తూ ఆయన కూడా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి తనువు చాలించడం చుట్టుపక్కల వారిని కలిచి వేసింది. అమ్మానాన్న ఇద్దరు ఒకేసారి మరణించడంతో రామ్ లిఖిత్ నిశ్చేష్టుడయ్యాడు. ఒక్కడిని ఎలా బ్రతకాలంటూ కన్నీరుమున్నరవుతున్నాడు. బంధువులు ఆదివారం భార్యభర్తలిద్దరి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story