AP: రిషితేశ్వరి కేసును కొట్టేసిన కోర్టు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ కు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్, సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. రిషితేశ్వరి ఆత్మహత్య అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసును కొట్టేసింది. నిందితులపై పూర్తి సాక్షాధారాలతో కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, సంశయ లాభం కింద ముద్దాయిలను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే..?
2015 జూలై 14న నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా సుబేదారికి చెందిన రిషితేశ్వరి ఇందిరా ప్రియదర్శిని లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందింది. సీనియర్ విద్యార్థుల ఈవ్‌టీజింగ్‌తో పాటు ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ, ప్రజా సంఘాలతోపాటు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. రిషితేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు ఆర్కిటెక్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దుంప హనీషా నాగ సాయిలక్ష్మి, నాలుగో సంవత్సరం చదువుతున్న ధారావత్ జై చరణ్ నాయక్, నరాల శ్రీనివా్‌సతో పాటు ప్రిన్సిపాల్ గూడవల్లి బాబురావును నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. పై ముగ్గురు విద్యార్థుల వేధింపుల వల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని, ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
బోరుమన్న తల్లిదండ్రులు
కోర్టు కొట్టేయడంతో.. ఆమె తల్లిదండ్రులు బోరుమన్నారు. ఈ తీర్పు విన్న వెంటనే కన్నీరు పెట్టుకున్నారు. సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదంటూ రిషితేశ్వరి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు కోర్టు చుట్టూ తిరిగినా తమకు న్యాయం దక్కలేదన్నారు. మరోపక్క నిందితుల తరఫు తల్లిదండ్రులు, బంధువులు ఇప్పటికైౖనా న్యాయం గెలిచిందని, కొందరు రాజకీయ, ప్రజా సంఘాల ముసుగులో స్వలాభం కోసమే తమ పిల్లల్ని బలి పశువుల్ని చేశారని అన్నారు. కాగా, రిషితేశ్వరి కేసులో కోర్టు తీర్పు తమకు సమ్మతం కాదని దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామని సీనియర్ న్యాయవాది వైకేతో పాటు రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com