మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు కూడా లేని రాజకీయ నేత.. కుంజా బొజ్జి కన్నుమూత

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు కూడా లేని రాజకీయ నేత.. కుంజా బొజ్జి కన్నుమూత
తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేసిన కుంజా బొజ్జి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఉండేందుకు ఇల్లు లేదు.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని అడవి వెంకన్న గూడెం.

తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేసిన కుంజా బొజ్జి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఉండేందుకు ఇల్లు లేదు. ఉమ్మడి రాష్ట్రంలొ 1985,89,1994లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. చదువు లేకపోయినా, ఉద్యమాలు ఆయన్ని నాయకుడిగా మార్చాయి.

తెలుగు చదవడం వచ్చు కానీ రాయడం మాత్రం రాదు. తన పేరుని ఇంగ్లీషులో, తెలుగులో రాయడం నేర్చుకున్నారు. ఉండడానికి ఇల్లులేని ఆయన తన భార్య లాలమ్మతో కలిసి కుమార్తెల వద్ద ఉంటూ కాలం గడుపుతున్నారు. తనకు వచ్చే ఫించన్ డబ్బుతో కుమార్తె మంగమ్మ వద్ద ఇన్నాళ్లు ఉన్నారు.

మచ్చలేని రాజకీయ నేతగా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ గిరిజన మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు కుంజా బొజ్జి. ఆయన మృతి పట్ల పలువురు సీపీఎం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags

Next Story