కడప జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోన్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం

కడప జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోన్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం

కడప జిల్లాలో బయటపడ్డ బెట్టింగ్ వ్యవహారం మాఫియా సినిమాలను తలపిస్తోంది. ప్రొద్దుటూరు కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగ్‌ రాకెట్‌ దెబ్బకు సామాన్యులు బలైపోతున్నారు. సాధారణ ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఫోకస్‌ పెంచింది.

విచారణ ముమ్మరం చేసిన పోలీసులు కొంతమంది బుకీలను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన బుకీల నుంచి లక్షరూపాయల నగదు, ఆరు కిలోల గంజాయి, రెండు మొబైల్ కమ్యూనికేటర్లు, ఏడు ల్యాప్ టాప్ లు, రెండు వాహనాలు, అకౌంట్ పాస్ బుక్ లు, క్యాలుక్యులేటర్లు స్వాధీనం చేసుకున్నారు.. బెంగళూర్, హైదరాబాద్, గోవాతో పాటు పలు నగరాలకు వీరి నెట్ వర్క్ విస్తరించిందని ఎస్పీ అన్భురాజ్ తెలిపారు. ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశామని.. పరారీలో ఉన్న బుకీల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు.

ఓ సాధారణ వ్యక్తి బెట్టింగ్ ముఠా డాన్ గా మారి వందల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తుండడం తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముఠా గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అయిన నరసింహ అలియాస్ ట్రిపుల్ ఎన్ జాడ కోసం అన్వేషిస్తున్నారు. అటు ఈ బెట్టింగ్‌ రాకెట్‌కు సంబంధించి కీలక ఆధారాలు టీవీ5 చేతికి చిక్కాయి.

ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే 34 కోట్ల మేర బెట్టింగ్ కార్యకలాపాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకుండా బెట్టింగ్ కార్యకలాపాల కోసం యువతను రిక్రూట్మెంట్ చేసుకున్నారు. దీని కోసం యువకుల నుంచి డిపాజిట్ పేరిట లక్షలు వసూలు చేశారు. ప్రతిరోజు 2 నుంచి 3కోట్ల మేర బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలిసింది. ప్రొద్దుటూరు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, గోవా వరకు బెట్టింగ్ సామ్రాజ్యం విస్తరించింది.

గోవాలో క్యాసినో నిర్వహణ కోసం ట్రిపుల్‌ ఎన్‌ బ్యాచ్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సినీ ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌లోనూ పెద్ద ఎత్తున ఆ ముఠా పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. గత నెల 19, 20వ తేదిల్లో గోవాలో వందల కోట్లతో క్యాసినో వ్యాపారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు, తిరుపతి, విశాఖ జిల్లాల నుంచి అధికార పార్టీ ప్రముఖలు భారీగా హాజరు అయినట్లు సమాచారం. ప్రత్యేక విమానాల్లో 300 మంది పంటర్లను NNN బ్యాచ్ గోవా తీసుకెళ్లింది. అక్కడ వారికి కోరినంత విదేశీ మద్యం, ప్రాంతాలవారీ రుచులతో విందులు, 50 మంది రష్యా భామలతో చిందులు ఏర్పాటుచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags

Read MoreRead Less
Next Story