Crime: వివేకా హత్య కేసు.. ఓకేసారి ఐదుగురు నిందితులు విచారణ

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ హత్యకు సంబంధించిన పలు వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలకు సమన్లు జారీఅయ్యాయి. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాక ఐదుగురు నిందితులనూ సీబీఐ ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి. ఐదుగురు నిందితులు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు శుక్రవారం హాజరు కానున్నారు.
కడప సెంట్రల్ జైలులో ఉన్న సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలను సాయంత్రం ప్రత్యేక బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఒక్కొక్కరికి ఎస్‌ఐ స్థాయి అధికారితోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు చొప్పున మొత్తం 12 మంది భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు బెయిల్‌పై బయట ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి సైతం కడప నుంచి బయల్దేరి రేపు(శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు.
ఈ కేసులో నిందితులంతా తొలిసారిగా హైదరాబాద్‌లో విచారణకు హాజరవుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019 మార్చి 15న వివేకా పులివెందులలోని సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. విచారణ నత్తనడకన సాగుతుండడంతో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com