CRIME: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నేరాలు

CRIME: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నేరాలు
X
వరుసగా హత్యాచార ఘటనలు... కఠిన చట్టాలు తీసుకొస్తున్న మారని మృగాళ్లు

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న నేరాలు.. హత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఆరు నెలల చిన్నారినీ వదలని రాక్షసులను. ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేసిన మైనర్‌ కర్కోటకులను చూసి సమాజం ఉలిక్కిపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాడులు నిత్య కృత్యంగా మారాయి. సెల్‌ రూపంలో చేతుల్లోకి వచ్చిన సాంకేతికత.. మహిళను చులకనగా చూసే సినిమాలు, ప్రభుత్వ వైఫల్యాలు.. అవగాహన లేమీ... పోలీసుల నిర్లక్ష్యం... కారణం ఏదైనా... అమాయకులు మాత్రం బలైపోతున్నారు.

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో జరిగిన హత్యాచార ఘటన... తెలుగు రాష్ట్రాలను శోకసంద్రంలో ముంచేసింది. ఆరు నెలల చిన్నారిపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో కొందరు, మద్యం, గంజాయి మత్తులో ఇంకొందరు మృగాళ్లుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా పొక్సో కేసులు పెరిగిపోవడం ప్రస్తు పరిస్థితికి అద్దం పడుతోంది. ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై పోలీసుల దర్యాప్తు కూడా సహేతుకంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

అర్థం పర్థం లేని సినిమాలు... మహిళలను సెక్స్‌సింబల్‌గా చూపే చిత్రాలు పసి హృదయాల్లో చెడు ముద్రను చాలా బలంగా వేస్తున్నాయి. సినిమాల్లోలానే తాము ప్రవర్తించాలని.. వారిని అనుకరించాలనే బాల్యం నుంచే చిన్నారులు తప్పుదోవ పడుతున్నారు. సిగరెట్లు నుంచి ప్రారంభమయ్యే ఈ అలవాట్లు... వ్యసనాలుగా మారి బంగారు భవిష్యత్తును కాలగర్భంలో కలిపేస్తున్నాయి. అరచేతిలోకి వచ్చిన సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాల వీక్షణ కూడా ఇలాంటి దాడులకు ప్రేరణగా నిలుస్తుంది. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండాపోతుంది. యేడాదికేడాది హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. చట్టాలు సక్రమంగా అమలై నిందితులకు వేగంగా శిక్ష పడితేనే మహిళలపై లైంగిక వేధింపులు, బాలికలపై అత్యాచార ఘటనలు అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. మహిళల రక్షణ కోసం నిర్భయ, బాలికల రక్షణ కోసం పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా నిందితుల్లో భయం ఉండడం లేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌తరగతులు అనివార్యం కావడంతో టెన్త్‌, ఇంటర్‌ చదివే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వక తప్పలేదు. తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో అశ్లీల వెబ్‌సైట్లు, వీడియోలు చూడడం వల్ల కొందరు చెడుమార్గాన్ని అనుసరించి ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Tags

Next Story