ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ముగిసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కలిసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని ఇప్పటికే ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. కరోనా పరిస్థితులు, టీకా షెడ్యూల్ వల్ల ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రొసీడింగ్స్‌ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరువర్గాలు కూర్చుని ఎన్నికల నిర్వహణపై మాట్లాడుకోవాలని.. ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈ నేపథ్యంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఎస్‌ఈసీని కలిశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సిన అవసరాన్ని సీఎస్‌కు ఎస్‌ఈసీ వివరించారు. ఆర్థిక సంఘం నిధులకు సకాలంలో ఎన్నికలు జరగాలని.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సూచించారు.
అటు..సీఎస్ సైతం తమ వాదనను ఎస్‌ఈసీ ముందు ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులను ఎస్‌ఈసీకి సీఎస్ వివరించారు. దీనిలో భాగంగా కరోనా వ్యాప్తి, కొత్త వైరస్ కేసులపై ఎస్‌ఈసీకి సీఎస్ నివేదిక సమర్పించారు. ఫిబ్రవరిలో ఎన్నికలకు సన్నద్ధం కాలేమని.. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్‌ఈసీకి సీఎస్ వివరించారు. ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేయాలని అధికారుల బృందం ఎస్‌ఈసీని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com