AMARAVATHI: అమరావతి నుంచి విద్యుత్‌ కేబుళ్ల తరలింపు

AMARAVATHI: అమరావతి నుంచి విద్యుత్‌ కేబుళ్ల తరలింపు
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తరలింపు వ్యవహారం.... రాజధాని రైతుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో భూగర్భంలో వేసేందుకు నిల్వ ఉంచిన విద్యుత్తు కేబుళ్లను విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురానికి ….వైసీపీ అస్మదీయ గుత్త సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ తరలిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ తరలింపు వ్యవహారం బయటకు వచ్చింది. 4 నెలల కిందట ఇలాగే అనుమతులు లేకుండానే ఆర్థికమంత్రి బుగ్గన చెప్పారంటూ.. అమరావతి నుంచి నంద్యాల జిల్లా డోన్‌కు 20 కోట్ల విలువైన తాగునీటి పైపులను తరలించేసింది. తాజాగా విశాఖలో ఈ సంస్థ చేపట్టిన పనుల కోసం కేబుల్‌ డ్రమ్ములను తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కటి సుమారు 500 మీటర్ల నిడివి కలిగిన 220 కేవీ తీగలున్న డ్రమ్ములను భారీ వాహనాల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు. రవాణా వాహనాల వద్ద ఉన్న కాగితాలను పరిశీలిస్తే.. వాటిపై డ్రమ్ములు అమ్మడానికి కాదు... కేవలం ఒక సైట్‌ నుంచి మరో సైట్‌కు తరలించటానికే అని రాసి ఉంది. సత్యసాయి ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ బిల్లుతో భారీ వాహనాల్లో డ్రమ్ములను తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు దాదాపు 18 డ్రమ్ములు తరలించినట్లు సమాచారం. లింగాయపాలెం నుంచి మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, అచ్యుతాపురం, విశాఖపట్నం అని ట్రాన్స్‌పోర్ట్‌ బిల్లులో ఉంది. ఇక్కడి సామగ్రిని మరో ప్రాంతానికి తరలించాలంటే సీఆర్డీఏ అనుమతివ్వాలి. దీనికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. డ్రమ్ములను తరలిస్తున్న వాహనాల వద్దకు పోలీసులు శనివారం వచ్చి పరిశీలించి.. వివరాలు నమోదు చేసుకుని వదిలేశారు. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story