Cyclone Michaung : పొలాల్లో నీరు... రైతు కంట కన్నీరు
మిగ్‌జాం తుపాను సృష్టించిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే చేజారిపోవడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు ఎడతెరపిలేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా... చాలా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో వరినీట మునిగింది. దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో ధాన్యం కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రహదారుల పక్కన నిల్వ చేసుకున్న ధాన్యం తడవడంతో వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పొలాల్లోకి నీరు చేరి వరి మునిగింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది.
ఏలూరు జిల్లాలో కోతకు వచ్చిన పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. యర్రగుంటపల్లిలో చేతికొచ్చిన వేరుశెనగ పంట నీటమునిగింది. కోత కోసిన వరి కుప్పలు, మిర్చి తడిసిపోయాయి. ఉంగుటూరు మండలంలో ధాన్యం రాశులను వరదముంచెత్తింది. ప్రభుత్వం సకాలంలో గోనె సంచులు ఇవ్వకపోవడం.., రవాణా సౌకర్యం కల్పించనందునే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడ్డారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులకు తుపాను కన్నీటిని మిగిల్చింది. ముమ్మిడివరంలో కోతకొచ్చిన వేల ఎకరాల వరి నేలవాలింది. అరటి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చిరుతపూడిలో కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షాలు వరి, అపరాలు, మొక్కజొన్న పంటను తుడిచిపెట్టేశాయి.
అనకాపల్లి జిల్లాలో వేల ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి. కల్లాల్లో పోసిన ధాన్యం తడవగా అక్కడి నుంచి తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వరి, మిర్చి, ఆరటి, పత్తి, తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులకు అరటి, మిర్చి, కూరగాయలు, బొప్పాయి, కొబ్బరి తోటలు నేలవాలయి. తుపానుకు నష్టపోయిన.... ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మిగ్ జాం తుపాను ధాటికి ఏపీలో అపార ఆస్తి నష్టం జరిగింది. విజయవాడలో BSNL ఉద్యోగుల నివాస గృహాలపై చెట్లు విరిగిపడ్డాయి. అమరావతి మండలం పెదమద్దూరు వాగు పొంగి..అమరావతి-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లా తునిలో బొండుగడ్డ వాగు పొంగి తుని-నర్సీపట్నం రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఎన్టీఆర్ జిల్లాలో కట్లేరు, పడమటి, ఎదుళ్ల, విప్ల, గుర్రపు, కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం-విజయవాడ మార్గంలో.. రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం పల్లంపల్లి -దాములూరు గ్రామాల మధ్య కాజ్‌వే మీదుగా వరద ప్రవహిస్తోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏలూరు కాలువ ఉద్ధృతికి పరిసర గ్రామాలకు రాకపోకలు స్తంబించాయి. నర్సీపట్నం-తుని రహదారి జలమయమైంది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కేంద్రంలోని.... కస్తూర్బా పాఠశాల సమీపంలోని నాగులగుంట చెరువు తెగి వరద పాఠశాలలోకి చేరగా 300మంది బాలికలను ట్రాక్టర్‌పై తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com