Cyclone Jawad: ఉత్తరాంధ్రకు తప్పిన జవాద్ తుఫాను ముప్పు

Cyclone Jawad (tv5news.in)
Cyclone Jawad: ఉత్తరాంధ్రకు జవాద్ తుఫాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇవాళ మధ్యాహ్నాం నాటికి ఒడిశాలోని పూరి తీరానికి చేరనుంది. అప్పటివరకూ ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను బలహీనపడినా దాని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.విశాఖ,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని చోట్ల గాలులు బలంగా వీస్తాయని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
జవాద్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే వానలు ప్రారంభమయ్యాయి. శనివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో అధికవేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి చెట్టు కూలి యువతి చనిపోయింది.
ఇవాళ, రేపు కూడా మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లా గార మండలం తులుగులో 7.1 సెంటి మీటర్లు, సోంపేట మండలం కొర్లాం,పలాసల్లో 5.5 సెంటిమీటర్లు, సంతబొమ్మాలిలో 5.4 సెంటిమీటర్ల, కవిటి మండల రాజాపురంలో 5.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వానలకు పలు మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. విజయనగరం జిల్లా పూసాపాటిరేగ మండలం చింతపల్లిలో సముద్రం 120 అడుగులు ముందుకు వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com