MONTHA: ఏపీ వైపు దూసుకొస్తున్న "మొంథా" ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం తదుపరి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ... నేటికి తీవ్ర వాయుగుండంగా, రేపటికి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు వాతావరణ కేంద్రం అధికారులు కూడా అక్టోబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో అతి భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
రెడ్ అలర్ట్ జారీ
‘మొంథా’ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ‘రెడ్’ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారినందున బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తీరం వెంబడి బలమైన గాలులు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో "తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదు. ...తదుపరి సూచనలు వచ్చేవరకు బోట్లను లంగరు వేసి ఉంచితే మంచిది," అని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జ జగన్నాధకుమార్ తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. "మెరుపులతో కూడిన వర్షం, ఉరుములు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, హోర్డింగ్‌లు ఉన్న ప్రదేశాల్లో నిలవకండి. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్‌లో ఉంచకూడదు" అని సూచించారు.
ముఖ్యమంత్రి సమీక్ష
ఏపీకి మొంథా తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. 'మొంథా' తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న 4 రోజులలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాన్ని సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిందని గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని... భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు సంపదకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రియల్ టైమ్ సమాచారాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. మొంథా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

