మూడు రాజధానులపై నేటినుంచి రోజువారీ విచారణ

మూడు రాజధానులపై నేటినుంచి రోజువారీ విచారణ
రాజధాని మార్పు, 3 రాజధానుల ఎర్పాటు సంబంధిత కేసులపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌..

రాజధాని మార్పు, 3 రాజధానుల ఎర్పాటు సంబంధిత కేసులపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు నుంచి రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. రాజధాని మార్పుపై మొత్తం 223 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. ఇందులో 189 పిటిషన్లు స్టే కోసం వేసినవే. దీంతో మిగిలిన 34 పిటీషన్‌లను ముందుగా విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. మరోవైపు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో విచారణ జరుగుతోంది, కీలకపత్రాలు పరిశీలన చేయాల్సి వస్తే ప్రత్యక్ష విచారణ జరిపే అవకాశముంది.

పిటిషన్లు దాఖలు చేసిన వారిలో అమరావతి గ్రామాల రైతులు, సామాజిక కార్యకర్తలు, విపక్ష పార్టీలు, అమరావతి ఉద్యమకారులు ఉన్నారు. వీరితో పాటు వివిధ పార్టీలు కూడా తమ అభిప్రాయాలతో అఫిడవిట్లు దాఖలు చేశాయి. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల సంఖ్య, వాటి తీవ్రత ఆధారంగా వీటిపై రోజువారీ విచారణ జరిపేందుకు హైకోర్టు గత నెలలోనే అంగీకారం తెలిపింది. కరోనా ప్రభావం కూడా తగ్గిన నేపథ్యంలో రోజువారీ విచారణకు ఆటంకాలు కూడా ఉండబోవని అంచనా వేస్తున్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు కోసం గవర్నర్‌ సాయంతో ఆమోదించిన బిల్లులపై స్టేటస్‌ కో కొనసాగుతోంది. గవర్నర్‌ ఆమోదించిన ఈ బిల్లులు రాజ్యాంగబద్ధంగా రూపుదిద్దుకోలేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ బిల్లుల వ్యవహారం హైకోర్టు విచారణలో కీలకంగా మారబోతోంది.హైకోర్టు ఈ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకోనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రాజధానుల ఏర్పాటుకు తాను అనుకూలమని ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేయగా.. విపక్షాలు మాత్రం తాము కొత్త రాజధానులకు వ్యతిరేకమంటూ అఫిడవిట్లు దాఖలు చేశాయి. విపక్షాలన్నీ రైతులకు మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story