Andhra Pradesh: ఏపీలో వైసీపీ నేతలకు డిసెంబర్ 14 టెన్షన్

Andhra Pradesh: ఏపీలో వైసీపీ నేతలకు ఇప్పుడు డిసెంబర్ 14 టెన్షన్ పట్టుకుంది! ఆ రోజు.... గడప గడప ఫైనల్ వర్క్ షాప్‌కు సీఎం జగన్ రెడీ అవుతుండటంతో...ఎవరిపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే.. నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెంచుకున్న నేతల లిస్ట్ రెడీ అయింది.
ప్రభుత్వ సర్వేలు, ఐప్యాక్ టీంతో పాటు అనేక ఇతర సర్వేల లిస్ట్ సీఎం జగన్ దగ్గరుంది. ఈ సమావేశంలో.... మైక్రో లెవెల్‌లో చేసిన అధ్యయనాలలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ప్రధాన చర్చకు రానుంది. ఈ సారి మొత్తంగా 36 మంది నేతల టికెట్లు డౌట్లో పడుతుందనే ప్రచారం జరుగుతోంది. మాజీలు కాబోతున్న వారిలో మంత్రులుకూడా ఉన్నారనే చర్చ జరగుతోంది.
పనిచేయని వారికి, జనాల్లో వ్యతిరేకత ఉన్న వారికి, టికెట్ దక్కదని ముందే చెప్పేశారు సీఎంజగన్. టికెట్ వస్తే మీ పనితీరు వల్లనే, రాకపోతే అది కూడా మీ వల్లనేనని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 14న చివరిసారిగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌పై టెన్షన్ చెందుతున్నారు వైసీపీ నేతలు.
ఈ వర్క్ షాప్‌తో మంత్రులు, ఎమ్మెల్యేల లెక్కలు తేలిపోతాయి. ప్రజల వద్ద రెడ్ మార్క్ పడిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు డౌట్లో పడినట్లేనని తెలుస్తోంది. వీరిలో 36మంది ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో 27 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇపుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇందులో మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులూ ఉన్నారని సమాచారం. మరి ఈ సమావేశంలో వీరికి టికెట్లు ఇవ్వబోమని చెప్పేస్తారా? అన్న చర్చ జరుగుతోంది.
మరో వైపు వైసీపీ తరపున గెలిచిన 22 మంది లోక్ సభ సభ్యులలో సగానికి సగం అంటే 11 ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ డిసైండ్ అయినట్లు సమాచారం. ఇక పదిమంది ఎమ్మెల్యేల వారసులకూ టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. ఇవన్నీ కలిపితే 60 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్నే వర్క్‌షాప్ లో చెబుతారా? అంటూ టెన్షన్ పడుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.
ఇప్పటికే ఎమ్మెల్యేలను 3 సార్లు హెచ్చరించిన నేపథ్యంలో మరో ఛాన్స్ ఇవ్వబోరనే మాట వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. వర్క్‌షాష్‌లో సీఎం జగన్ ఏ విషయాలను చెబుతారు? ఎవరి ప్రోగ్రెస్ రిపోర్టులో ఏముందో? అని ఆందోళన చెందుతున్నారు.175కి 175 గెలవాలంటూ మాటిమాటికి చెబుతున్న జగన్..... ఇప్పుడు ఏకంగా 60 మందిపై అసంతృప్తి ఉందని తెలియడంతో.... ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. సర్వే రిపోర్టలన్నింటిని పరిశీలించి....తనకు నచ్చిన నిర్ణయం తీసుకుంటారంటున్నారు వైసీపీ శ్రేణులు.
ఏది ఏమైనా... ఈ నెల 14న జరిగే రివ్యూలో..... ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్ అన్నది మాత్రం ఉండదంటున్నారు వైసీపీ శ్రేణులు. టికెట్లు దక్కని వారి వివరాలు బయట పెట్టడమో లేక వారికే తెలియచేయడమో చేస్తారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో కొత్తవారిని ముందే రెడీ చేసుకుని ఎన్నికలకు వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ నెల 14న వర్క్ షాప్ సంచలనంగానే మారుతుందంటున్నారు వైసీపీ శ్రేణులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

