DEEPAWALI: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ వెనుక అనేక పురాణా కథలున్నాయి. దీపావళి అంటే దీపాల వరుస. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఆయుధం దీపమే అని పండితులు చెబుతున్నారు. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో దివ్వెల పండగ అని, మరికొన్ని ప్రాంతాల్లో దివిటీల పండగ అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఐదు రోజులు జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా టీవీ 5 తరఫున అందరికి శుభాకాంక్షలు.
చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకొని సంతోషంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగాంగా దీపం 2.0 పథకంతో ఈ పండుగను మరింత కాంతివంతంగా జరుపుకోవాలన్నారు. తెలుగింట ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు నేడు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలనలో తెలంగాణ సంతోషంగా ఉందన్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా అందరూ పండుగ జరుపుకోవాలని ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఇక రాష్ట్రంలో ప్రగతి పరుగులే: మంత్రి లోకేష్
ఏపీ ప్రజలకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘విధ్వంసపు చీకట్లను ప్రగతి వెలుగులతో తరిమేశాం. సంక్షోభాల చెడు పాలనపై సంక్షేమ పాలన విజయం సాధించింది. ఇక ప్రతిరోజూ ప్రతి ఇంటా సంక్షేమం పండుగే. రాష్ట్రంలో ప్రగతి పరుగులే. కూటమి ప్రభుత్వం పేదల లోగిళ్లలో దీపం పథకంతో వెలుగులు నింపనుంది.’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది.
జగన్ దీపావళి శుభాకాంక్షలు
దీపావళిని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి’ అంటూ జగన్ ఆకాంక్షించారు.
టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త
దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి పర్వదినాన ప్రజలంతా టపాసులు కాలుస్తారు. కానీ, టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం, ఆరోగ్యానికి హానీ కలుగుతుంది. అందుకే పరిమిత పరిమాణంలో క్రాకర్లు పేల్చండి. ఈ సమయంలో కాటన్ దుస్తులు ధరిస్తే మేలు. దీంతో పాటు దీపాలు వెలిగించేటప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్ని ప్రమాదానికి అవకాశం లేని ప్రదేశాలలో దీపాలను వెలిగించండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com