DEEPAWALI: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి సంబరాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. వీధుల్లో టపాసులు కాల్చుతూ, మతాబులు వెలిగిస్తూ చిన్నారులు, పెద్దలు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. అనేక ఇళ్లను దీపాలతో అలంకరణ చేశారు. చారిత్రక భవనాలు ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. వ్యాపార భవనాలు విద్యుత్ కాంతులతో మెరుస్తున్నాయి. అనేకమంది ప్రముఖులు తమ ఇళ్ళ ముందు దీపావళి సంబరాలను జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తమ నివాసంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు దంపతులు బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.
దీపావళి వేడుకలను వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోని తన నివాసంలో సతీమణి భారతితో కలిసి జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు జగన్ ఎక్స్‌లో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళిని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ చేశారు. విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్ష్మీ యాగం.. మార్కాపురంలోని పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నరకసుర వధను ఏర్పాటు చేయగా.. ప్రజలు అసక్తిగా తిలకించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదేవేరులతో మలయ్యప్ప స్వామిని సర్వభూపాల వాహనంపై బంగారువాకిలి ముందున్న ఘంటా మండపంలో ఉంచారు. స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదలను చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. అనంతరం మలయప్పస్వామికి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఆస్థానం వల్ల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడ సందడి నెలకొంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పండగ సందర్భంగా నరకాసురుని వధ నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా రుక్మిణీ, సత్యభామ అవతారంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఊరేగింపుగా వచ్చి.. నరకాసురున్ని వధించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
శ్మశానంలో దీపావళి వేడుకలు
సాధారణంగా దీపావళి అంటే దేవుళ్లను పూజించి, ఇంటి ముందు దీపాలు వెలిగించి సంతోషంగా పండుగను జరుపుకొంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామ ప్రజలు మాత్రం దీపావళి ముందు రోజే పండుగ జరుపుకొంటారు. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? కానీ వాళ్లు దీపావళి వేడుకలను చేసుకునేది ఇంట్లో కాదు శ్మశానవాటికలో. దీపావళి రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే, వీళ్లు మాత్రం శ్మశాన వాటికలకు వచ్చి సమాధుల ముందు దీపాలు వెలిగించారు. అందరూ కలిసి టపాసులు కాల్చి దీపావాళి పండుగను చేసుకున్నారు. ఈ ఆచారాన్ని దాదాపు 20 సంవత్సరాలకు పైగా కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com