DELHI BLAST: ఢిల్లీ పేలుళ్ల వెనుక 15 మంది డాక్టర్లు..!

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ముఖ్య అనుచరుడు అమీర్ రషీద్ అలీని ఢిల్లీలో అరెస్టు చేసింది. ఢిల్లీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన కారు i-20 అమీర్ రషీద్ పేరిటే రిజిస్ట్రేషన్ అయిందని ఎన్ఐఏ విచారణలో తేలింది. దాంతో ఎన్ఐఏ ఐ20 కారు ఓనర్ అమీర్ రషీద్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. ఎర్రకోట పేలుళ్ల తర్వాత భద్రతా బలగాలు దేశ వ్యతిరేక శక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ టెర్రరిజంపైనే దృష్టి సారించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న హర్యానాకు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనే ఉగ్రసంస్థలతో సంబంధమున్న అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ అనే ముగ్గురు డాక్టర్లును ఇప్పటికే అరెస్ట్ చేశారు. జమ్ముకాశ్మీర్ అనంత్‌నాగ్‌లో ప్రియాంక ఉంటున్న హాస్టల్ పై దాడి చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
కశ్మీర్ వైద్యులపై నిఘా
మొబైల్, సిమ్ కార్డు ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 200 మంది కాశ్మీర్ వైద్యులపైన దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువున్న కశ్మీర్ విద్యార్థులపైనా నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారు నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీ అని భద్రతా ఏజెన్సీ సంస్థలు గుర్తించాయి. అలానే అతడితో సంబంధమున్న మరో ఐదుగురు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో వారితో కలిసి చదువుకున్న, పని చేస్తున్న ఇతర వైద్యులపైనా అధికారులు నిఘా పెట్టారు. ఉగ్ర కుట్రలో ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండడం, నిందితుల మరో కారు కూడా అక్కడే లభ్యం కావడంతో క్యాంపస్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

