PAWAN: జగన్ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం
వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్‌కి కూడా డబ్బుల్లేవని వెల్లడించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్ కన్నబాబుతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వకుండా అనేక పథకాలను జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని పవన్ అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ఇచ్చిన రుణాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదని పవన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. జల్‌జీవన్ మిషన్ పథకానికీ రాష్ట్ర వాటా నిధులు కేటాయించలేదని.... పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులూ మళ్లించారని అన్నారు. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్ని వెసులుబాట్లు కావాలని కోరతామన్నారు.
పనికిరాదని పడేసిన చెత్త నుంచి రాష్ట్రంలో ఏటా రూ.2,643 కోట్ల సంపద సృష్టించొచ్చని పవన్ అన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాల ద్వారా 2.50 లక్షల మందికి ఉపాధి కల్పించొచ్చని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో ఘన, ద్రవ వనరుల నిర్వహణ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తామని వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలొచ్చేలా ప్రాజెక్టును రూపొందించామని... ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని తెలిపారు. పంచభూతాలను గౌరవించే సంప్రదాయం మనదని... నదులు, నీటివనరులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. ఆకలికి తాళలేక గోవులు ప్లాస్టిక్ కవర్లు తింటుండటం అత్యంత బాధాకరమన్నారు.
రోడ్లపై గుంతలు ఉండొద్దు
జగన్ పాలనలో రహదారులపై మోకాల్లోతు గోతులతో ఆంధ్ర ప్రజలు పడిన ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా చర్యలకు ఉపక్రమించింది. రహదారులపై ఉన్న గుంతలు, మినీ చెరువులను పూడ్చివేయాలని రోడ్లు భవనాల శాఖను చంద్రబాబు ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. తక్షణమే పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com