Devaragattu Banni Utsavam: దేవరగట్టు కర్రల సమరంలో రక్తపుటేరులు

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు రక్తసిక్తమైంది. బన్నీ ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. అయితే ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ మొదలైంది. ఎలాగైనా దేవతామూర్తులను తమ ప్రాంతానికే తీసుకెళ్లాలని రెండు వర్గాలు కర్రలతో ఘర్షణకు దిగాయి. ఈ సందర్భంగా భక్తులంతా రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ గొడవలో మొత్తం ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాలు ప్రత్యేకం. విజయదశమి రోజున పలు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో తలపడతారు. ఇది కర్రల సమరంగా అభివర్ణిస్తుంటారు. కర్రల సమరం జరగడం సంప్రదాయంగా వస్తుంది. కర్రలతో కొట్టుకోవడం వల్ల తలలు పగులుతాయి. రక్తం చిందుతుంది.పలువురు గాయాలపాలవుతారు. అయినా సరే కర్రల సమరంలో పాల్గొనేందుకు గ్రామస్థులు ఏమాత్రం వెనకడుగు వేయరు. మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో సమరానికి సై అంటున్నారు ఏడు గ్రామాల ప్రజలు.మరోవైపు కర్రల సమరంలో పాల్గొనేందుకు వేలాది మంది కదంతొక్కుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com