DURGAMMA: ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ముగిశాయి. శరన్నవరాత్రుల చివరి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం నుంచే భక్తులు బారులు తీరడంతో క్యూలైన్లు కిక్కిరిపోయాయి. గురువారం మధ్యాహ్నానికే 94,723 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భవానీ మాలధారులు ఇంద్రకీలాద్రికి పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు మెుత్తం 'జై దుర్గా.. జైజై దుర్గా' నామస్మరణలతో మార్మోగిపోయాయి. భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలూ కల్పించారు. వారికి మంచినీళ్లు, మజ్జిగ, పాలు వంటివి అందించారు.రాత్రి 11 గంటల వరకూ అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చేందుకు వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అందరికీ సమానంగా అమ్మవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16 వాహన సేవలు, మూలమూర్తి దర్శనం నిర్వహించినట్లు తెలిపారు. గరుడసేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శనం కల్పించినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకు 5.80 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారి హుండీకి రూ.25.12 కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపారు. మొత్తంగా 26 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ చేయగా.. 28లక్షలకు పైగా లడ్డూల విక్రయం జరిగినట్లు తితిదే ఛైర్మన్ వెల్లడించారు. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారన్నారు. 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలు , గరుడసేవ రోజు 20 రాష్ట్రాల నుంచి 37 బృందాలు (780 కళాకారులు) సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com