Dhulipalla Narendra: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై పక్కా ఆధారాలున్నాయి: ధూళిపాళ్ల

Dhulipalla Narendra: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్లంలో మట్టిమాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ఛలో అనమర్లపూడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. పొన్నూరులో వైసీపీ అక్రమమైనింగ్‌పై ఛలో అనమర్లపూడికి పిలుపునిచ్చిన ధూళిపాళ్ల.. ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వహించి అక్రమాలు చాటి చెబుతామని ప్రకటించారు.
ఐతే ఎలాగోలా ఆంక్షలు దాటుకుని అనమర్లపూడి చేరుకున్న దూళిపాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్బంధాలనుంచి తప్పించుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు నరేంద్ర. ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్లారు. ఇక నరేంద్ర అరెస్ట్‌తో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై పక్కా ఆధారాలున్నాయన్నారు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర.
పొన్నూరునియోజవర్గంలోని చెరుకు, అనమర్ల పూడిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీనాయకులు, ఎమ్మెల్యే అండతోనే అంతా జరుగుతోందన్నారు. అందుకే ఏ ఒక్క అధికారీ స్పందించడం లేదని మండిపడ్డారు. అటు టీడీపీ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందంటూ ఫైరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com