AP: ఆర్జీవీని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రాంగోపాల్ వర్మను సీఐ శ్రీకాంత్ బాబు బృందం సుమారు 9 గంటలపాటు విచారించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడానికి కారణమేంటని ఆర్జీవీని పోలీసులు ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారు? ఎవరు సహకరించారు? వంటి ప్రశ్నలు సంధించారు. అయితే, తన సినిమా ప్రచారంలో భాగంగానే తాను అలా చేసినట్లు రాంగోపాల్ వర్మ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఆర్జీవీని కలిసిన వైసీపీ నేత
పోలీసు విచారణకు హాజరయ్యేముందు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో రాంగోపాల్‌వర్మ భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హూటల్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఒంగోలు రూరల్ పీఎస్‌లో విచారణకు హజరయ్యే ముందుగా చెవిరెడ్డిని కలిసి ఆర్జీవీ మంతనాలు జరపడడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అసలు కేసు ఏంటంటే..?
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌ల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా మార్ఫింగ్ చిత్రాలతో ఎక్స్‌లో ట్వీట్లు పెట్టారు. దీనిపై తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 10న ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. వర్మ విచారణ సందర్భంగా పోలీసులు హడావిడి చేశారు. ఒంగోలులో పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. మద్దిపాడు పీఎస్‌లో తనపై నమోదైన కేసులో పోలీసు విచారణను తప్పించుకోవడానికి ఆర్జీవీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. తనను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగితే అజ్ఞాతంలోకి వెళ్లి తల దాచుకున్నారు. చివరకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చినా, పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని చెప్పటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రామ్‌గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com