Mahbubnagar: 25 మంది చిన్నారులపై వీధి కుక్కల దాడి

మహబూబ్ నగర్ లో వీధి కుక్కల స్వైర విహారం కలకలం రేపింది. ఒకే రోజు 25 మందిపై కుక్కలు దాడి చేయడంతో జిల్లాలో భయాందోళన వాతావరణం నెలకొంది. గాయపడిన వారంతా చిన్నారులే కావడం గమనార్హం. గురువారం జిల్లాలోని గోల్ మజీద్, హనుమాన్ పుర, పాలమూరు వివిధ ప్రాంతాల్లో 25 మంది చిన్నారులపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. గాయపడిన వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 25 మందిని జనరల్ ఆస్పత్రిలో టీటీ ఏఆర్‌వీ వ్యాక్సిన్‌లు ఇచ్చారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు.
మహబూబ్ నగర్ ఏరియాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని బాధిత పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన చర్యలు తీసుకోలేదని అన్నారు. అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు 25 మంది చిన్నారులపై కుక్కలు దాడి జరిగేది కాదని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. కాగా.. గురువారం రాత్రి జిల్లా సర్వజన ఆసుపత్రిలో చిన్నారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కుక్కలను సుదూర ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com