Vijayawada: విజయవాడలో మురుగునీటి కాలువల సమస్య..
విజయవాడలో మురుగునీటి కాల్వల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. డ్రెయిన్లు, మ్యాన్ హోల్స్ నిర్వహణ ప్రణాళికల తయారీ, అమల్లో V.M.C విఫలమైందని... విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పరిశుభ్ర నగరంగా ర్యాంకు వచ్చిందని అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నా... వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉందని అంటున్నారు. విజయవాడ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా బాగు చేయడంలో పాలకమండలి విఫమైంది. డ్రైనేజీ కనెక్షన్లు ఉన్న వాటికంటే లేని ఇళ్ల సంఖ్యే అధికంగా ఉంది. V.M.C పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా, కనెక్షన్లు లేని ఇళ్లు 1.09 లక్షల వరకు ఉన్నాయి. 2016లో 461 కోట్ల రూపాయలతో సుమారు చేపట్టిన స్ట్రామ్‌వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో... మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది.
బెజవాడలో వందల సంఖ్యలో ఓపెన్ డ్రెయిన్లు ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 12వందల37 ఓపెన్ డ్రైయిన్లు ఉన్నాయి. వీటిలో 97 డ్రైయిన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. రాజరాజేశ్వరిపేటలో ఐదేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు పోగొట్టుకోగా, 6 నెలల క్రితం గురునానక్ కాలనీలో ఆరేళ్ల బాలుడు డ్రైయిన్‌లో పడి మృత్యువాత పడ్డాడు. గురునానక్ కాలనీ ఘటనతో విమర్శలు వెల్లువెత్తటంతో... ఓపెన్ డ్రైయిన్లపై మూతలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు V.M.C అధికారులు వెల్లడించారు. సర్వే నిర్వహించి పని పూర్తిచేస్తామని అధికారులు... ఆ తర్వాత మాట మరిచారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ స్పందించి రోడ్ల మరమ్మతులు చేయించాలని, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com