మహిళపై దాడికి యత్నించిన ఇద్దరి తాట తీసిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇద్దరి తాట తీశారు ట్రాఫిక్ పోలీసులు. సర్పవరం జంక్షన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 1న యు.కొత్తపల్లి మండలం నాగులంకకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారును ఢీకొట్టారు. కారులో ఉన్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐకి గాయాలయ్యాయి. దీంతో ఆ ఇద్దరిపైనా లాఠీలు ఝుళిపించారు. పోలీసులు కొట్టే విజువల్స్ మాత్రమే బయటకు రావడంతో అంతకు ముందు జరిగిందేంటో తెలుసుకోకుండా, కొందరు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. పోలీసుల అత్యుత్సాహమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.. దీనిపై స్పందించిన డీఎస్పీ.. అసలేం జరిగిందో ఆరా తీశారు.. అప్పటి సీసీ ఫుటేజీని బయటపెట్టారు. కారులో ఉన్న మహిళను రక్షించేందుకే మందుబాబుల తాట తీయాల్సి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. మహిళపట్ల అసభ్యంకరంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.