drone: కర్నూలు కేంద్రంగా నూతన శకం

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. కర్నూలు జిల్లాలోని డీఆర్‌డీవో (DRDO) ఆధ్వర్యంలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) వద్ద తాజాగా జరిగిన యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ పరీక్ష – ULPGM‑V3 (UAV-Launched Precision Guided Missile) దేశ రక్షణా వ్యూహాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఈ ప్రయోగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించడం, దాని ఫొటోలు పంచుకోవడం దీని ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ ప్రయోగం వెనక ఉన్న సాంకేతిక పటిమ దేశీయ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ‘ఫైర్ అండ్ ఫర్‌గెట్’ వ్యవస్థ ఆధారంగా పని చేసే ఈ ఆయుధాన్ని డ్రోన్లలోనే అమర్చేలా రూపొందించారు. అంటే శత్రువు కనపడిన వెంటనే ప్రయోగించగలగడం, లక్ష్యాన్ని నిర్దిష్టంగా ఛేదించడం ఈ మిసైల్‌కు తలమానికాలు. వర్షం, పొగ, అంధకారంలోనూ పని చేసే ‘ఇన్‌ఫ్రారెడ్’ లేదా లేజర్ గైడెన్స్‌తో ఇది లక్ష్యాన్ని ఎక్కడికైనా వెంబడించగలదు.
ఈ మిసైల్ అత్యల్ప వ్యయంతో తయారు చేయవచ్చు, చిన్న యూఏవీల నుంచే ప్రయోగించవచ్చు. తపస్-BH, ఆర్చర్-ఎన్‌జీ వంటి UAVల కోసం దీన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా చిన్నదగ్గర దాడులకు అనువుగా ఉండే ఈ ఆయుధం బోర్డర్ గస్తీల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా మారనుంది. డ్రోన్ ఆధారిత యుద్ధతంత్రాల్లో చైనా, అమెరికా, ఇజ్రాయెల్‌ల వంటి దేశాలు ఇప్పటికే దూసుకుపోతుండగా... భారత్ కూడా అదే దారిలో బలంగా అడుగులు వేస్తోంది. ఇంకొక విశేషం ఏమంటే – ఈ ప్రయోగం జరిగింది కర్నూల్ జిల్లా పాలకొలను సమీపంలోని NOAR రేంజిలో. ఇది దేశంలోనే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (EW) రేంజ్‌లలో ఒకటి. ఇది 2,200 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది.
డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, లేజర్ ఆయుధాల వంటి అత్యాధునిక సాంకేతికత ఇక్కడ అభివృద్ధి అవుతోంది. 2016-17లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ కేంద్రం ద్వారా దేశ రక్షణ రంగానికి ఎన్నో కీలక ప్రయోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానమే కీలకం. DRDOతో పాటు అనేక స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఈలు భాగస్వాములవడం ముఖ్యమైన పరిణామం. "ఆత్మనిర్భర్ భారత్" లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసిన ఈ మిసైల్, దేశ రక్షణ స్వావలంబనకు మార్గదర్శిగా నిలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com