DRONE SHOW: ఆకాశంలో మహాద్భుతం

DRONE SHOW: ఆకాశంలో మహాద్భుతం
X
చరిత్ర సృష్టించిన అమరావతి డ్రోన్ షో.... 5, 500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో

విజయవాడలోని కృష్ణా తీరంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జాతీయ డ్రోన్‌ సమ్మిట్‌లో భాగంగా పున్నమి ఘాట్‌లో అతిపెద్ద డ్రోన్‌ షోను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శన... వీక్షకులను మంత్రముగ్దులను చేసింది. డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ షోను వీక్షించేలా ఐదు చోట్ల డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతోపాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రదర్శనను తిలకించేందుకు కృష్ణా తీరానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. కృష్ణా తీరమంతా సందర్శకులతో నిండిపోయింది. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ డ్రోన్‌ షోకు హాజరయ్యారు.


అద్భుతం మహాద్భుతం

మంగళవారం రాత్రి 8.30 గంటలకు డ్రోన్‌షో మొదలైంది. ఒక్కసారిగా ఆకాశంలో నక్షత్రాలుగా 5,500 డ్రోన్లు పైకి లేచాయి. ఆకాశంలో వేలాది నక్షత్రాలుగా కనిపించిన డ్రోన్లు.. ఆ తర్వాత కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను డ్రోన్‌ సెన్సార్లు స్వీకరించి అత్యద్భుత ప్రదర్శన చేశాయి. ముందుగా ఏవియేషన్‌ రంగాన్ని పరియం చేస్తూ థీమ్‌ సాగింది. విమానయాన రంగానికి ఆద్యులుగా భావించే రైట్‌ బ్రదర్స్‌ సృష్టించిన విమానంతో కూడిన తొలి ఏవియేషన్‌ తపాలా బిళ్లను ప్రదర్శించింది. 1911- 1961 లో గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా ఫస్ట్‌ ఏరియల్‌ పోస్ట్‌ ఒక రూపాయి భారత తపాలా బిళ్లను ఆవిష్కరించింది. ఆ తర్వాత విమానయాన రంగం విప్లవాత్మక మార్పులతో ఏ విధంగా ముందుకు సాగింది. ఆధునిక సౌకర్యవంతమైన విమాన ప్రయాణాలకు నిదర్శనంగా అతి పెద్ద బోయింగ్‌ విమానాన్ని ప్రదర్శించింది. మూడోదిగా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ను ఒక చారిత్రకమైన ఘట్టంగా అభివర్ణిస్తూ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రదర్శిస్తూ....అమరావతి భవిష్యత్తును ప్రస్తావిస్తూ బుద్ధుడి చిత్రాన్ని డ్రోన్లు ఆవిష్కరించాయి.

చంద్రబాబు చేతులమీదుగా...

డ్రోన్‌ హ్యాకథాన్‌లో విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. డ్రోన్ సిటీకి 300 ఎకరాలు కేటాయించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రీసెర్చ్, డెవలప్మెంట్ కోసం సివిల్ ఏవియేషన్ నుంచీ సపోర్టు ఇస్తామన్నారు. దేశం డ్రోన్ టెక్నాలజీకి బేస్ కావాలన్న మా ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story