DRONE SHOW: ఒకేరోజు 5 ప్రపంచ రికార్డులు

DRONE SHOW: ఒకేరోజు 5 ప్రపంచ రికార్డులు
X
ఆకాశంలో అద్భుతానికి రికార్డుల మోత... చంద్రబాబుకు ధ్రువపత్రాలు అందించిన గిన్నీస్‌ ప్రతినిధులు

దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షోకి విజయవాడ వేదికగా మారింది. ఆకాశంలో చుక్కలు కుప్పబోసినట్లు…నక్షత్రాల్లా మిలమిలా డ్రోన్లు మెరిసిపోయాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షో అదరహో అనే రేంజ్‌లో జరిగింది. కృష్ణా తీరంలో…పున్నమి ఘాట్‌లో…పున్నమి వెలుగులను మించి డ్రోన్‌ హ్యాకథాన్‌ అబ్బురపరిచింది. ఒకటి కాదు రెండు కాదు..ఒకేసారి 5,500 డ్రోన్లు వెలుగులు విరజిమ్మూతూ ఆకాశంలోకి దూసుకెళ్లి పలు థీమ్‌లను ఆవిష్కరించాయి. డ్రోన్ల తళుకుబెళుకుల ముందు నక్షత్రాలు చిన్నబోయాయి.


గిన్నీస్ రికార్డులు

అమరావతి వేదికగా 5,500 డ్రోన్లతో తొలిసారిగా దేశంలోనే అతిపెద్ద షోను నిర్వహించారు. కాగా డ్రోన్ షోకు ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఈ సందర్భంగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు.. డ్రోన్ షో అనంతరం.. సీఎం చంద్రబాబు నాయుడికి గిన్నిస్‌ బుక్‌ రికార్డు ధ్రువపత్రాలు అందించారు. ఈ డ్రోన్ షో ద్వారా అమరావతిలో ఒకే రోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.

డ్రోన్ షో అందుకున్న ఐదు రికార్డులు

1. లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి

2. నదీ తీరాన లార్జెస్ట్‌ ల్యాండ్ మార్క్‌

3. అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి

4. అతిపెద్ద ఏరియల్‌ లోగో ఆకృతి

5. అతిపెద్ద విమానాకృతి

ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు

సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ఈ భారీ ఈవెంట్ కు హాజరై అత్యంత ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో, సీఎం చంద్రబాబు డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. డ్రోన్ షో సందర్భంగా పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 'కృష్ణం వందే జగద్గురుం' కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తమ్మీద ఈ డ్రోన్ షో ఏపీ ప్రభుత్వ విజన్ ను చాటేలా, టెక్నాలజీ పట్ల సీఎం చంద్రబాబు అనురక్తిని వెల్లడించేలా సాగింది.

Tags

Next Story