Drugs : కలకలం రేపుతోన్న ఏపీ డ్రగ్స్ వ్వవహారం

Drugs : కలకలం రేపుతోన్న ఏపీ డ్రగ్స్ వ్వవహారం

ఏపీలో బయటపడిన డ్రగ్స్‌ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. సూడాన్‌తో పాటు అనేక దేశాలకు నరసరావుపేట నుంచి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు తేలడంతో.. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. పైగా ఈ డ్రగ్‌ సిండికేట్‌లోకి అమెరికా నుంచి నిధులు కూడా వచ్చాయన్న వార్తలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కూడా అలర్ట్‌ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ నిధులు తరలించేందుకు పలు సూట్‌ కేసు కంపెనీలు ఏర్పాటు చేయడం ఫార్మా రంగంలో కూడా కలకలం రేపుతోంది.

నరసరావుపేట కేంద్రంగా సాగిన డ్రగ్స్‌ వెనుక భారీ డీల్స్‌ కుదిరినట్లు.. టీవీ5 పరిశోధనలో వెల్లడైంది. సూడాన్‌తో పాటు ఇతర దేశాలకు డ్రగ్స్‌ ఎగుమతి చేసిన కంపెనీల్లోకి భారీగా విదేశీ పెట్టుబడులు తరలినట్లు తెలిస్తోంది. కేవలం ఏడాదిలో పలు కంపెనీలను నెలకొల్పడంతో పాటు విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసేందుకు లైసెన్స్‌ ఉన్న కంపెనీలను టేకోవర్‌ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీల్లోకి నిధులు తరలించిన కీలక వ్యక్తులు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినవారిగా తెలుస్తోంది. కోడెల శివప్రసాద్‌ ఫ్యామిలీకి చెందిన మూడు కంపెనీలను టేకోవర్‌ చేసేందుకు పలు డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసి నిధులు తరలించినట్లు సమాచారం. అయితే.. ప్రారంభమైన కొన్ని నెలలకే ఆ కంపెనీల విలువను పెంచి దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలను అమెరికా నుంచి హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ముతో సేఫ్‌ ఫార్ములేషన్‌ను టేకోవర్‌ చేయడంతో పాటు.. మిగిలిన కంపెనీల్లో కూడా పాగా వేశారు.

పైకి డైరెక్టర్లందరూ ఏపీకి చెందినవారైనా.. నిధులు మాత్రం న్యూజెర్సీ నుంచి వచ్చాయని కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఒంగోలుకు చెందిన కనిగిరి గాదె కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌ కేంద్రంగా కంపెనీల ఏర్పాటుకు ఒంగోలు అడ్రస్‌తో ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులు సమర్పించిన ఈమె.. నిధులు తరలించే విషయంలో న్యూజెర్సీలోని అడ్రస్‌ను ఇవ్వడం విశేషం. అలాగే సేఫ్‌ ఫార్ములేషన్‌ కంపెనీని టేకోవర్‌ చేసేందుకు ఫెమా నిబంధనల ప్రకారం వ్యాల్యూయేషన్‌ వేయించారు. ఈ నిధులన్నీ హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రణయ ఫార్ములేషన్‌ పేరుతో కంపెనీ ఏర్పాటుకు శనగల శ్రీధర్‌ రెడ్డితో పాటు ఒంగోలుకు చెందిన తాటిపర్తి అంజిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అమెరికా నుంచి వచ్చిన నిధులతో కీలక కంపెనీల్లోకి తరలిన తరవాత బాలినేని గోవింద రెడ్డి, బాలినేని అరుణ వాటిలో డైరెక్టర్లుగా చేరారు.

ఈ మొత్తం వ్యవహారంలో పది కంపెనీలకు లింక్‌ ఉండటం విశేషం. గుంటూరు జిల్లలోని సేఫ్‌ కంపెనీలకు విదేశాలకు ఎగుమతి చేసేందుకు లైసెన్స్‌ ఉండటంతో వీరు ఇదే కంపెనీలను టార్గెట్‌ చేశారు. వీటికి కట్టిన విలువ కూడా చాలా తక్కువగా ఉండటంతో దీని వెనుక బెదిరింపులు ఉన్నాయా అన్న అనుమానం కలుతోంది. కరోనా సమయంలో ఈ కంపెనీల నుంచి భారీ ఎత్తున ఔషధాలను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. అయితే అవి ఔషధాలేనా లేక డ్రగ్సా అన్న అనుమానం ఇప్పుడు కలుతోంది. తాజాగా డ్రగ్స్‌ ఎగుమతి గుట్టు రట్టు కావడంతో కేంద్ర వాణిజ్య శాఖ రంగంలోకి దిగింది. సేఫ్‌ ఫార్ములేషన్స్‌ కంపెనీకి నోటీసు జారీ చేసింది. ఈ డ్రగ్‌ సిండికేట్‌లోకి విదేశీ నిధులు కూడా వచ్చినట్లు తెలియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా రంగంలోకి దిగవచ్చని తెలుస్తోంది. ఉగ్రవాదులకు అడ్డాలైన సూడాన్‌ వంటి దేశాలకు డ్రగ్స్‌ సరఫరా కావడంతో దేశ భద్రతా ఏజెన్సీలు కూడా ఈ డీల్స్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది.

Tags

Next Story