విజయవాడ దుర్గమ్మ ఆర్జిత సేవలు, ప్రసాదాలు ధరల పెంపు!

విజయవాడ దుర్గమ్మ ఆర్జిత సేవలు, ప్రసాదాలు ధరల పెంపు!

దుర్గమ్మ ఆర్జిత సేవలు, ప్రసాదాలు సామాన్య భక్తులకు భారం అయ్యేలా కనిపిస్తోంది. అమ్మవారి సేవలు, ప్రసాదాల ధరలు మరోమారు పెంచుతూ దుర్గగుడి పాలకమండలి, అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పాలక మండలి ప్రతిపాదనలపై అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారు. అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి లడ్డు ప్రసాదం, పులిహోరా తీసుకోవడం భక్తులకు ఆనవాయితీ. అయితే మరోమారు పాలకమండలి సభ్యులు అమ్మవారి ప్రసాదం, ఆర్జిత సేవల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. భక్తులకు అందించే అమ్మవారి పులిహోర ప్రసాదం పరిమాణం, ధరలో మార్పులు చేసేందుకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 150 గ్రాముల పులిహోరాను ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ పరిమాణాన్ని రెండు వందల గ్రాములకు పెంచి.. ధరను పది రూపాయలు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా 46 అంశాలకు ఆమోదం తెలిపారు. వీటిలో తొమ్మిది అంశాల్ని దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతి కోసం పంపించారు.

ప్రసాదం ధర పెంపుతో పాటు రోజూ ప్రదోష కాలంలో అమ్మవారికి నిర్వహించే పంచ హారతులు, ఆర్జిత టిక్కెట్టుపై ఇప్పటివరకు ఇద్దరిని అనుమతిస్తున్నారు. తాజాగా తీసుకున్న పాలకమండలి నిర్ణయం మేరకు ఇకపై ఒక్క భక్తునికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ మార్పును జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. దేవస్థానంలో వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునేందుకు కానుకగా చెల్లిస్తున్న 150 రూపాయల రుసుమును 300 రూపాయలకు పెంచుతూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.


Tags

Next Story