Editorial: ఆనం రాజీనామా...?

Editorial: ఆనం రాజీనామా...?
రసవత్తరంగా వెంకటగిరి వైసీపీ రాజకీయం; ఇక అవమానాలు భరించేది లేదంటున్న ఆనం; జగన్ తో తాడోపేడోకు సిద్ధమైన సీనియర్; త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం; ఏ పార్టీలోకి వెళ్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ...


ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారట. సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆనంను పక్కనబెట్టిన జగన్.. తాజాగా వెంకటగిరిలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయట. దీంతో రగిలిపోతున్న ఈ సీనియర్ నేత.. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారట.

వైసీపీ నుంచి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీపైనే కొంతకాలంగా అసంతృప్త వ్యాఖ్యలు చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డికి అధిష్టానం వరుస షాకులిస్తోంది. ఇప్పటికే వెంకటగిరిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇన్ ఛార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అవకాశమిచ్చిన జగన్.. స్ధానికంగా అధికారుల మార్పు, ఇతర అంశాల్లోనూ ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులు ఇలా ఎటు చూసినా ఆనంకు సహాయనిరాకరణ తప్పడం లేదు. తాజాగా గడపగడపకూ కార్యక్రమం నిర్వహించవద్దంటూ ఆదేశాలు పంపిన అధిష్టానం.. నేదురుమల్లి రామ్ తో కలిసి వెళ్లాలని సూచించింది. దీంతో తనకు ఎంతో జూనియర్ అయిన నేదురుమల్లి వారసుడి చేతిలో దారుణమైన అవమానం తట్టుకోలేకపోతున్నారట.

వెంకటగిరి నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆనం రామనారాయణరెడ్డి రగిలిపోతున్నారట. వెంటనే ఏమీ చేసేందుకు వీల్లేకపోవడంతో తన భవిష్యత్ రాజకీయాలపై సన్నిహితులతో చర్చించారట. ఇప్పటికే ఆనంకు జరుగుతున్న వరుస అవమానాలపై ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రత తగ్గింపు, సహాయనిరాకరణతో పాటు తోటి ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడం వంటి పరిణామాల్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆనంపై వారు ఒత్తిడి పెంచుతున్నారట. ఈనేపథ్యంలో త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందట. సీనియర్ రాజకీయ నాయకుడైన తనకు వైసీపీలో ఎదురవుతున్న అవమానాలపై స్పందించబోతున్నారట. అలాగే భవిష్యత్ ప్రణాళికలపైనా ఆయన ఈ ప్రెస్ మీట్లో ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చర్చించుకుంటున్నారు. దీంతో ఆనం ప్రెస్ మీట్ పై ఉత్కంఠ నెలకొంది.

వైసీపీలో ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో వెంటనే పార్టీ మారేందుకు ఆనం సిద్ధంగానే ఉన్నారట. అదే సమయంలో ఆయనకు టీడీపీ నుంచి ఆఫర్లు కూడా ఉన్నాయి. పార్టీ మారి వెంకటగిరి నుంచి లేదా ఆత్మకూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆనం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కుదరని పక్షంలో తన కుమార్తె, రాజకీయ వారసురాలైన కైవల్యారెడ్డిని ఆత్మకూరు నుంచి బరిలోకి దింపేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలే వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్ల హవా ఉన్న జిల్లా కావడం, స్ధానిక నేతల మద్దతు లేకుండా రిస్క్ చేస్తే ఇబ్బందులు తప్పవన్న అంచనాల నేపథ్యంలో వెంకటగిరి రాజుల మద్దతు కొనసాగేలా ఆనం చూసుకునే అవకాశముందట. ఏదేమైనా ఈ ఏడాది మార్చిలో తన రాజకీయ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ ఉండేలా ఆనం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story