Editorial: మాకొద్దీ "రాజకీయం"

Editorial: మాకొద్దీ రాజకీయం
ప్రకంపనలు రేపుతున్న దగ్గుబాటి ప్రకటన; కొడుకుతో సహా రాజకీయాలకు దూరమని వెల్లడి; భార్య పురందేశ్వరి నిర్ణయం ఏంటనే దానిపై ఉత్కంఠ; పాలిటిక్స్ వద్దనడం వెనుక ఆంతర్యమేంటి?అనుచరులతో మళ్లీ ఒత్తిడి చేయించే ప్రయత్నమా?

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.... తనతోపాటు, తన కుమారుడు ఎన్నికల బరిలో ఉండబోమంటూ చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పుతో వేడెక్కిన రాజకీయం దగ్గుబాటి మాటలతో మరింత రంజుగా తయారైంది. రాష్ట్ర రాజకీయాల్లోనూ దగ్గుబాటి ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ప్రత్యేకించి పర్చూరు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణలకు కూడా దారి తీసే అవకాశం కనిపిస్తోంది. పర్చూరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్‌ పెద్దల్లుడిగా రెండు దశాబ్దాలపాటు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు. 1983లో అప్పటి మార్టూరు అసెంబ్లీ స్థానం నుంచి ఉపఎన్నికలో గెలుపొందిన దగ్గుబాటి ... 1985,1989లో పర్చూరు అసెంబ్లీ నుంచి గెలుపొందారు. 1991 బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడిగా విజయం సాధించిన ఈయన 1995 చివర నుంచి టీడీపీకి దూరమయ్యారు. ఎన్టీఆర్‌ టీడీపీలో కొంతకాలం ఉన్న ఈయన స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికై సంచలనం సృష్టించారు. అనంతరం కొన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.

1999 ఎన్నికల్లో పోటీచేయకుండా పార్టీలకు దూరంగా ఉన్న దగ్గుబాటి అనూహ్యంగా 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెలుగులోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ఈయన, బాపట్ల పార్లమెంట్‌ నుంచి సతీమణి పురందేశ్వరీ పోటీచేసి గెలుపొందారు. 2009లో తిరిగి వెంకటేశ్వరరావు పర్చూరు నుంచి గెలుపొందగా.. ఈయన సతీమణి విశాఖపట్నం ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం క్రమేపీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు దగ్గుబాటి. తర్వాత పురందేశ్వరి బీజేపీ తీర్థం పుచ్చుకోగా... దగ్గుబాటి ఏపార్టీలో చేరలేదు. అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్‌తో మంతనాలు జరిపి కుమారుడు హితేష్ తో కలిసి వైసీపీలో చేరారు. తన కుమారుడికి పర్చూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలనే ఒప్పందంతో జగన్ పార్టీలో దగ్గుబాటి చేరారు. జగన్ కూడా హితేష్‌కు టికెట్ కేటాయించారు. కానీ.. హితేష్‌కు అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారడంతో చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో.. మరో మార్గం లేక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఈయనకు పరాభవం ఎదురైంది. అప్పటి నుంచీ రాజకీయాల పట్ల దగ్గుబాటి పెద్దగా ఆసక్తి చూపలేదు.

వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే రాజకీయాలపై అనాసక్తి కనబర్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండి ఎమ్మెల్యే అయితే పరిస్థితులు ఎలా ఉండేవో గానీ.. ప్రతికూల ఫలితాలు రావడంతో దగ్గుబాటిలో మరోసారి రాజకీయ నైరాశ్యం అలుముకుంది. పైగా.. దగ్గుబాటికి వ్యతిరేకంగా పనిచేసిన రామనాథం బాబును తనను కనీసం సంప్రదించకుండా జగన్ పార్టీలోకి తీసుకోవడంతో ఈ పరిణామంపై దగ్గుబాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీకి తండ్రీకొడుకులిద్దరూ గుడ్‌బై చెప్పేశారు. కొంత కాలంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కుమారుడు హితేష్‌కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కేటాయిస్తారని పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇందుకు తగ్గట్లుగా దగ్గుబాటికి గుండెపోటు వచ్చిన సమయంలో చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించారు. అప్పటి నుంచి చంద్రబాబు కుటుంబంతో, దగ్గుబాటి కుటుంబ సంబంధాలు మళ్లీ బలపడ్డాయి. ఈ ప్రచారం జరుగుతున్న తరుణంలో అసలు రాజకీయాల్లోనే కొనసాగకూడదని దగ్గుబాటి నిర్ణయించుకోవడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

తాజాగా.. తన కుమారుడు కూడా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు తావిచ్చింది. దగ్గుబాటి భార్య పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతారా లేక భర్త, కుమారుడి బాటలో రాజకీయాలకు దూరం జరుగుతారా అన్న వాదన కూడా తెరపైకొచ్చింది. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు నిర్ణయం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసిందని చెప్పక తప్పదు. రాజకీయాలు చేస్తున్న నాయకులు వారసులను ప్రోత్సహిస్తుంటే, వారసులకు పార్టీ టికెట్ల కోసం పట్టుబడుతున్న ఈరోజుల్లో... తన కొడుకు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాడని దగ్గుబాటి చేసిన ప్రకటన ఆసక్తికర చర్చకు తావిచ్చింది. 1999 ఎన్నికల నాటికే రాజకీయాలకు దూరమైన దగ్గుబాటి 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి వచ్చారు. అప్పుడు కూడా దగ్గుబాటి ఇంకొల్లు వద్ద నియోజకవర్గంలోని ఆత్మీయుల సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. చంద్రబాబు తాను అడిగినా అవకాశం ఇవ్వలేదని తానేమి చేయాలో మీరే చెప్పండంటూ ఆత్మీయులను కోరారు. పార్టీ ఏదైనా మీరు రంగంలోకి రావాల్సిందేనని, అవసరమైతే కాంగ్రె‌స్ లోనైనా చేరండని అనుచరుల నుంచి డిమాండ్‌ వచ్చేలా చేసుకోగలిగారు. ఆ పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకుంటున్న విశ్లేషకులు ఇప్పుడు కూడా మీరు రంగంలో ఉండాలంటూ అనుచరుల నుంచి ఒత్తిడి తెచ్చుకునే ఉద్దేశంతో ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు, దగ్గుబాటిల మధ్య సాన్నిహిత్యం పెరిగిన నేపథ్యంలో టీడీపీ టికెట్‌ తెచ్చుకోవాలని అనుచరులు ఒత్తిడి చేస్తే.. మీకోసం మళ్లీ తప్పటం లేదంటూ దగ్గుబాటి చెప్పుకునేందుకే ఈ ప్రకటన చేశారా అని కొందరు అనిమానిస్తున్నారు. మొత్తానికి దగ్గుబాటి నాకొద్దీ రాజకీయం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగుతోంది. చూడాలి మరి పెద్దాయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందో.

Tags

Next Story