Editorial: అందాల అరకులో అంతర్యుద్ధం

Editorial: అందాల అరకులో అంతర్యుద్ధం
అధికారపార్టీలో కుమ్ములాటలు; ఎమ్మెల్యేపై పార్టీలో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత; పక్కలో బల్లెంలా మారిన అనుచరులు; టిక్కెట్ కే ఎసరు పెడుతూ పావులు....



విశాఖ ఏజెన్సీలో కీలకంగా మారిన అరకులోయ నియోజకవర్గంలో 2019 ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. టీడీపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సివేరి దన్నుదొర ఓట్లు చీల్చడంతో వైసీపీ అభ్యర్థి చేట్టి ఫాల్గుణ గెలుపుపొందారు. అయితే గిరిపుత్రులు పెట్టుకున్న ఆశల్ని అరకు ఎమ్మెల్యే చేట్టి ఫాల్గుణ ఆశించిన స్థాయిలో నెరవేర్చలేకపోయారన్నది అందాల అరకులో టాక్. ఇటు ప్రజలనే కాకుండా పార్టీని నమ్ముకున్న నేతలను, కార్యకర్తలను కూడా సంతృప్తి పరచలేక పోయారనే విమర్శలను అరకు ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్ప ఎమ్మెల్యే సొంతంగా అరకు నియోజకవర్గ అభివృద్ధికి చెప్పుకోతగ్గ పనులేవి చేపట్టలేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక గిరిజన విశ్వ విద్యాలయం, మెడికల్ కాలేజీలు అరకులో ఏర్పాటు కావాల్సి ఉంది. ఎమ్మెల్యే సరిగా పట్టించుకోకపోవడంతో ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లాకు, మెడికల్ కాలేజీ పక్క నియోజకవర్గమైన పాడేరుకు తరలిపోవడంతో అరకువాసులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

రాజకీయ అనుభవం లేకపోవడంతో అధిష్టానం పెట్టుకున్న ఆశల్ని ఫాల్గుణ ఫుల్ ఫిల్ చేయలేకపోయారు ఎందుకు? ఎమ్మెల్యే అనాలోచిత చర్యల వల్ల నియోజకవర్గంలో వర్గపోరు కూడా ఎక్కువైంది. జడ్పీటీసీ, మండల పరిషత్ ఎన్నికల దగ్గర నుండి ఈ వర్గపోరు పెరుగుతూ వచ్చింది. ఆరు మండలాల్లో తన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపీపీ, వైస్ ఎంపీపీగా పదవులు కట్టబెట్టడాన్ని... ఇతర సామాజిక వర్గాల వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జడ్పీటీసీ, మండల పరిషత్ ఎన్నికల వరకూ ఒక్కటిగా ఉన్నవారంతా ఎమ్మెల్యే ఫాల్గుణతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి.. గంపెడాశలు పెట్టుకున్న శెట్టి రోషిణికి కాకుండా ముంచింగుఫుట్ మండలానికి చెందినఅరభిర సుభద్రకు దక్కడంతో నియోజకవర్గంలో చిచ్చు రాజుకుంది. ఎమ్మెల్యే ఫాల్గుణ వల్లే తమకు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి దక్కలేదన్న భావనలో రోషిణి ఫ్యామిలీ ఉంది. ఎమ్మెల్యేను నమ్ముకుని ఎంత పనిచేసినా తమకు గుర్తింపు లభించలేదన్న భావన అందరిలో పెరిగింది. ఈ కారణంతోనే కమిడి అశోక్, శెట్టి రోషిణి... ఎస్టీ కమిషన్ చైర్మన్, డాక్టర్ కుంభా రవి బాబుకు దగ్గరయ్యారు. హుకుంపేట మండల జడ్పీటీసీ రేగం మత్యలింగం ఎమ్మెల్యే ఫాల్గుణతో కలిసిఉన్నట్లు భ్రమ కల్పిస్తున్నా... అంతర్గతంగా తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ సంపాదించాలన్న పట్టుదలతో ఉన్నారన్నది ఓపెన్ టాక్. డుంబ్రి గుడ మండలం జడ్పీటీసీ చటారి జానకమ్మ మినహా మిగిలిన ఐదు మండలాల వైసీపీ నేతలు ఎమ్మెల్యే ఫాల్గుణకు దూరమయ్యారని సొంతపార్టీ నేతలే గుగుసలాడుకుంటున్నారు.

అరకులో కుటుంబ పాలన నడుస్తోందనేది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పెద్ద కుమారుడు చెట్టి వికాస్ బ్యాంకు ఉద్యోగి. అరకువేలిలో బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న వికాస్ ఉద్యోగిగా కొద్దీ మందికే తెలుసు. అనధికారికంగా రాజకీయాలు అన్నీ తానే చూసుకుంటారనేది పని కావాల్సిన వారికి పక్కాగా తెలుసు. కొత్తగా బదిలీపై ఏ ఒక్క ఉద్యోగి వచ్చినా ఎమ్మెల్యే పెద్ద కుమారుడు వికాస్ ను కలవాల్సిందే. మరో కుమారుడు చెట్టి వినయ్. తండ్రితో పాటు రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యే ఫాల్గుణ బావమరిది రూడకోట సర్పంచ్ కతారి సురేష్. వీళ్ళందరూ ఎవరికి వారు తనదైన శైలిలో ప్రభావం చూపుతుండడం వైసీపీ క్యాడర్ కు మింగున పడ్డంలేదు. మరో వైపు ఫాల్గుణకు భూ వివాదాల మచ్చ కూడా ఉంది. మరగడకు చెందిన భూముని ఎమ్మెల్యే స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గడప గడప కార్యక్రమానికి వెళ్లిన ఫాల్గుణపై భూ బాధితులు చేయి చేసుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఫాల్గుణ అరాచకాల ఫైల్... ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి ద్వారా అధినేతకు చేరిందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.

రానున్న ఎన్నికల్లో ఎంపీ మాధవి అరకులోయ నుండి అసెంబ్లీ బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఎస్టీ కమిటీ ఛైర్మన్ కుంబా రవిబాబు సైతం పోటీకి సై అంటున్నారని వైసీపీ క్యాడర్ కోడై కూస్తోంది. హుకుంపేట జడ్పీటీసీ సభ్యులు రేగం మత్స్యలింగం కూడా ఫాల్గుణకు పోటీలో ఉన్నట్లు అరకులో సీన్ కన్పిస్తోంది. ఓవరాల్ గా అందాల అరకులో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరిందనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story