Editorial: అంబటి పైకి పవన్ బ్రహ్మాస్త్రం

Editorial: అంబటి పైకి పవన్ బ్రహ్మాస్త్రం
సత్తెనపల్లి జనసేన అభ్యర్ధిగా కన్నా తనపై పదే పదే విరుచుకుపడుతున్న మంత్రి అంబటి రాంబాబుపై పవన్ కల్యాణ్ బ్రహ్మాస్త్రాన్ని సిద్దం చేస్తున్నారా ? అంబటికి రాజకీయంగా ఆగర్భ శత్రువైన కన్నా లక్ష్మీనారాయణ నే ఇందుకోసం ఎంచుకంటున్నారా ? జనసేనలోకి కన్నా పక్కా ప్లాన్ తో నే వస్తున్నారా ? చంద్రబాబు కూడా సై అంటున్నారా ?


కన్నా లక్ష్మీనారాయణ.. పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యేగా పి. జనార్ధనరెడ్డితో కలసి ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత వై.ఎస్. తో కలిసి పోరాటాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సుధీర్ఘకాలం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.రాష్ట్ర విభజన ఖరారవుతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ దశలో కిరణ్ స్థానంలో కన్నాను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం కూడా బలంగా సాగింది. అప్పట్లో ఢిల్లీ పెద్దలు కొందరు కన్నాను మోసం చేశారనే వార్తలు కూడా వినిపించాయి. విభజన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న కన్నా తర్వాత బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్షులయ్యారు.

2019 ఎన్నికల తర్వాత ఆయన్ను పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అధిష్టానం పగ్గాలు అప్పగించింది. జాతీయ కార్యవర్గంలో కన్నాకు చోటు కల్పించినా ఆతర్వాత పార్టీలో ఆయన పట్టు జారిపోయింది. సోము వీర్రాజు వచ్చాక పార్టీలో వైసీపీ అనుకూల వాదులకే పెద్దపీట పడుతోంది. దాంతో కన్నా మరింత దూరంగా ఉండిపోయారు.

ఈ క్రమంలో పవన్ ,చంద్రబాబు భేటీ తర్వాత కన్నా ఒక్కసారిగా ఒపెన్ అయ్యారు. పవన్ శక్తిని వాడుకోవడంలో బీజేపీ నాయకత్వం విఫలమయైందని ఆరోపించారు. అప్పటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా జరుగుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ గైర్హాజరయ్యారు. దాంతో ఆయన వర్గీయులు ఈనెల 26ను జనసేనలో చేరికకు ముహూర్తం పెట్టేసి నియోజకవర్గాన్ని కూడా సిద్దం చేసేశారు.


అయితే ముహూర్తాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదన్నది వాస్తవం. అయితే అదే సమయంలో కన్నా జనసేనలో చేరడమనేది మాత్రం ఇక లాంఛనమే. బహుశా పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒకటి, రెండు రోజుల ముందు కన్నా చేరిక జరగొచ్చని చెబుతున్నారు. ఇప్పటికీ బీజేపీ అధిష్టానంలోని కొందరు కన్నా పట్ల సానుకూల ధోరణితోనే ఉన్నారు. దాంతో కన్నా కొంత సమయం తీసుకుందామనే ఆలోచనకొచ్చారు.


ఏపీలో ఎన్నికలు జరగాల్సింది 2024 మేలో.. కానీ 23 మే కూడా రాకముందే ఏపీలో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. టీడీపీ,జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారయిందనే అభిప్రాయముంది.


వైసీపీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి టిక్కెట్లు ఇవ్వాలనే విషయంలో సర్వేల మీద సర్వేలు చేయించుకుంటోంది. ఈసమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరిక కోస్తా జిల్లాల్లో చర్చనీయాంశమైంది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరుపడ్డ ఆయనకు గుంటూరు జిల్లాలో పట్టుంది. దీంతో ఆయన ఈసారి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీకి సమాయత్తమవుతున్నట్లు సమాచారం.


గత ఎన్నికల్లో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి నరసరావుపేట లోక్ సభనుంచి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ, జనసేన పొత్తుతో కన్నా లక్ష్మీనారాయణ మంత్రి అంబటి రాంబాబును ఢీకొట్టబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. అంబటి రాంబాబు మంత్రి అయినప్పటినుంచి పవన్ కల్యాణ్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ ఆలోచనతోనే జగన్ అంబటిని అందలం ఎక్కించి ఉండొచ్చు. మంత్రిగా చేయడానికి ఏమీ లేకపోయినా పవన్ ను తిట్టే పనిలో మాత్రం అంబటి చురుగ్గానే వ్యవహరిస్తున్నారు.


జనసేన, అంబటి రాంబాబు మధ్య సోషల్ మీడియాలోను వార్ ఓ రేంజ్ లో నడుస్తుంటుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అంబటి ఓటమి పవన్ లక్ష్యాల్లో ఒకటిగా చెబుతున్నారు. సత్తెనపల్లి లో అంబటిపైకి కన్నా రూపంలో బ్రహ్రాస్త్రం వదలాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక్కడ ఒక 30 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే మరో రాజకీయ వైరం కథ తెలుస్తుంది. కన్నా , అంబటి ఇద్దరూ దాదాపుగా ఒకే సారి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చారు.


1989లో కన్నా పెదకూరపాడు నుంచి, అంబటి రేపల్లె నుంచి గెలిచి ఎమ్మెల్యేలయ్యారు. యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలుండేవి. కన్నాకు అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు అండ ఉండేది. అంబటి పట్ల రాయపాటి సాంబశివరావు అభిమానం చూపేవారు. అలా అప్పడు మొదలైన కన్నా,అంబటి రాజకీయ వైరం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ 1989నుంచి వరుసగా 94,99,2004 ఎన్నికల్లోను పెదకూరపాడు నుంచే గెలిచి రాజకీయంగా ఉన్నత స్ధానాలకు వెళ్లారు. అయితే అంబటి రేపల్లె లో 1994, 99లలో ఓడిపోయి వెనుకబడ్డారు. 2004 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. కానీ వై.ఎస్.కు దగ్గరగా ఉండడంతో కార్పోరేషన్ ఛైర్మన్ పదవి దక్కించుకుని రాజకీయంగా మళ్ళీ నిలదొక్కుకున్నారు.


వై.ఎస్. మరణం తర్వాత వైసీపీలో చేరి జగన్ కు సన్నిహితుడయ్యారు. 2014 లో సత్తెనపల్లిలో కోడెల చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడినా, 2019లో గెలిచి ఇప్పుడు జగన్ క్యాబినెట్ లో మంత్రిగా చోటు దక్కించుకోగలిగారు. వీరిద్దరూ ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఒకేసారి ఎమ్మెల్యేలయ్యారు. కానీ కన్నా 1989లో మంత్రి అయితే అంబటి మంత్రి కావడానికి 32 ఏళ్లు పట్టింది.ఆ విధంగా అంబటి ఇన్నాళ్లకు పదవుల రీత్యా, ప్రభావం రీత్యా కన్నా కంటే రాజకీయంగా ఉన్నతంగా ఉన్నట్లు భావించవచ్చు. అయితే ఈ ఇద్దరూ కాంగ్రెస్ లో ఉండగా ఒకే సీటుకోసం పోటీపడింది లేదు. వేర్వేరు పార్టీల్లో ఉండి ప్రత్యక్షంగా తలపడిందీ లేదు. కానీ 2024 లో ఆ సీన్ చూడబోతున్నామా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.


కన్నాను అంబటి పైకి ప్రయోగించాలని పవన్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీనికి కన్నా సిద్దంగా ఉన్నారా లేదా అనే చర్చ ఇప్పడు జరగడంలేదు. ఎందుకంటే కన్నాకు సత్తెనపల్లి బెస్ట్ ఆప్షన్ అవుతుందనే భావన ఉంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగానే ఉన్నాయి. టీడీపీ కి కూడా బాగా పట్టున్న నియోజకవర్గం. జనసేన సంస్థాగతంగా అంత బలంగా లేకున్నా టీడీపీ మద్దతు, పవన్ ఇమేజ్, కన్నా పట్ల ఉండే సానుకూలత ఆయనకు కలిసొచ్చే అవకాశముంది. ఇటు టీడీపీ కూడా 2024 లో అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నా కొంతమంది నేతలమీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. ఇటువంటి నేతలు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలనే పట్టుదలతో ఉంది. వీరిని ఓడించేందుకు ఏది కరెక్టు ప్లాన్ అనుకుంటే దాన్ని అమలు చేసే ఉద్దేశంతో ఉన్నారు. గతంలో చాలా సార్లు ప్రాతినిధ్యం వహించిన పెదకూరపాడు కి కన్నా 2009 ఎన్నికలనాటికే దూరమయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అక్కడ సేఫ్ కాదనుకుని గుంటూరు పశ్చిమ నుంచి పోటీసేసి గెలిచారు.

ఇప్పుడు ఈరెండింటిలో ఒక సీటును ఎంచుకునే అవకాశం కూడా ఉన్నా కన్నా అంబటిని ఢీకొట్టే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

RAVIPATI

Tags

Read MoreRead Less
Next Story