Editorial: మాజీమంత్రి "అనిల్ ఔట్"

Editorial: మాజీమంత్రి అనిల్ ఔట్
నెల్లూరు సిటీ వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు; సిట్టింగుకు చెక్ పెట్టేలా నేతల అడుగులు; పోటీ చేసేందుకు 2 గ్రూపుల మధ్య హోరాహోరీ; అధిష్టానంకు తలనొప్పిగా నేతల ఆధిపత్యపోరు; ప్రతిపక్ష టీడీపీకి సానుకూలంగా పరిణామాలు; నెల్లూరు జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది రెడ్డి సామాజికవర్గం...


2014కి ముందు వరకు నెల్లూరు కేంద్రంగా ఆనం కుటుంబం జిల్లాలోని దాదాపు నియోజకవర్గాలకు నగరాన్ని కేంద్రంగా చేసుకోని అభ్యర్థుల్ని ఖరారు చేసేవారు. రిజర్వేషన్ నియోజకవగర్గాల్లో మినహాయిస్తే దాదాపు రెడ్లే జిల్లాను శాసించారు. అడపాదడపా కొన్ని నియోజవర్గాల్లో అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మారినప్పటికీ.. దాదాపు ఐదారు దశాబ్దాలుగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని రెడ్డి సామాజికవర్గమే శాసిస్తూ వచ్చింది.


మెదటిసారి రాజశేఖర్ రెడ్డి 2009లో నెల్లూరు నగరంలో పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అనే ఓ బీసీ నాయకుడిని తయారు చేశారు. కాని అతిస్వల్ప ఆధిక్యంతో 2009లోనూ రెడ్డి సామాజికవర్గం నేతే గెలుపొందాడు. 2014లో తిరిగి బరిలో నిలిచిన అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించి చరిత్రను తిరగరాశాడు. నెల్లూరు నగరంలో రెడ్లే కాదు బీసీలకు కూడా పట్టుందని నిరూపించాడు. అదే జోరు 2019లోనూ కొనసాగించి రెండు దఫాలు ఎమ్మెల్యేగా నెల్లూరు నగర స్థానం నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించి మంత్రి పదవిని సైతం అధిరోహించాడు.

అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు నెల్లూరు నగర వైసీపీలొ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అబ్బాయి, బాబాయిగా... సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, నగరంలో బలమైన నేతగా ఉన్న రూప్ కుమార్ యాదవ్ వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వీరికి తోడు నెల్లూరు నగరానికి చెందిన మరోనేత, నుడా ఛైర్మన్ ద్వారకానాథ్ మంత్రి కాకాని సహకారంతో వేరు కుంపటి పెట్టుకుని నగరంలో హవా సాగిస్తున్నారు. ద్వారకానాథ్ వైశ్య సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్నాడు. ద్వారకానాథ్, రూప్ కుమార్ యాదవ్ లు ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొంటూ కలసిమెలసి తిరుగుతున్నారు. వీరు నెల్లూరు నగరంలో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేక వర్గంగా వేరు కుంపటి నడిపిస్తున్నారు.


వీరి ఇరువురి టార్గెట్ 2024 ఎన్నికలే అంటున్నారు అనుచరులు. వేరు కుంపటి పెట్టుకున్న డిప్యూటీ మేయర్, నుడా ఛైర్మన్ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ సీటు ఆశిస్తున్నారట. నెల్లూరు నగరంలో కమ్యునిటీ పరంగా, క్యాష్ పరంగా, బలగం, బందుగణం పరంగా ఇద్దరు సమఉజ్జీవులే కావడం విశేషం. ఇద్దరు సీటు ఆశిస్తుంది కూడా ఒకే పార్టీ నుంచి. అదీ అధికార వైసీపీ నుండే. ఇటు మరో వర్గం మాత్రం వీరి వ్యూహాలకు ధీటుగా ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది.


వీరిరువురికి కాకుండా ఆర్థికంగానే కాకుండా అధిష్టానం దగ్గర బలమైన నేతగా ఉన్నా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నగరం నుండి బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు వినికిడి. ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే వేరు కుంపటి పెట్టుకున్న ఇద్దరు నాయకులు సైతం సైలెంట్ అయిపోతారని... ప్రతిపక్షానికి సైతం గట్టి పోటీ పెట్టవచ్చని ఎత్తుగడ వేసినట్టు చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి వద్ద కూడా పలుమార్లు ప్రస్తావించారట. అయితే ఆదాల మాత్రం నెల్లూరు సిటీ సీటుపై ఏ మాత్రం ఆసక్తిగా లేరట. వీలైతె కావలి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. కానీ వైసీపీలోని ఒక వర్గం మాత్రం ఆదాలను ఎలాగైనా నెల్లూరు నగర స్థానం నుంచి పోటీ చేయించి దగ్గరుండి గెలిపించి.. ప్రత్యర్థి వర్గాన్ని కోలుకోలేని దెబ్బతీయాలని చూస్తోందట.

ఇప్పటికే కావలిలో గెస్ట్ హౌస్ కూడా కట్టుకుంటోన్న ఆదాల ఇక్కడి నుండే పోటీచేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డెబ్బై దాటిన తనకు ఇదే చివరి ఎన్నికగా చెప్పుకుని గెలిచి.. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి తీసుకుని రాజకీయాలకు స్వస్థి చెప్పాలని చూస్తున్నారట. అయితే ఆదాలను నెల్లూరు సిటీ నుండి బరిలోకి దింపాలనే వర్గంకు ధీటైన జవాబు ఇచ్చారట నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్. తన అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసి నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకా నాథ్ కు సహకరిస్తానని చెప్పారట.


ఈ మధ్య జరిగిన వైశ్యుల కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు జిల్లా వైసీపీ అద్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ద్వారకాకు మనం సపోర్టు చేయాలి సహకరించాలన్నారట. ఈ వ్యాఖ్యలు ద్వారకానాథే పోటీకి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నెల్లూరు నగరంలో లేకలేక పదవి చిక్కిన బీసీలు... నగర పట్టం చేజారిపోతుందే అన్న ఆవేదనలో ఉన్నారట. చూడాలి మరి రాజకీయం ఎన్నికల నాటికి ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story