Editorial: ఎమ్మెల్యేలపై జ"గన్"

Editorial: ఎమ్మెల్యేలపై జగన్
సీఎం చేతిలో ఎమ్మెల్యే చిట్టా; నెల్లూరు వైసీపీలో నిఘా రాజకీయం; ఎమ్మెల్యేల కదలికలపై జగన్ ఇంటలిజెన్స్; సీఎం టేబుల్ పై సిట్టింగుల భాగోతం; వెంకటగిరి ఫార్ములాను వాడబోతున్న సీఎం; మిగతా ఎమ్మెల్యేలకూ ఆనంకు పట్టిన గతే!


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లా కంటే నెల్లూరు జిల్లా అంటేనే మక్కువ ఎక్కువంట. అలాగే కర్నూలు జిల్లా నేతల కంటే నెల్లూరు జిల్లా నేతలంటేనే నమ్మకం ఎక్కువంట. తండ్రి మరణానంతరం చేపట్టిన ఓదార్పు యాత్రలో నెల్లూరు ప్రజలు అండగా నిలబడిన తీరే అందుకు కారణమంట. ఓదార్పు యాత్ర మెదలు పెట్టినప్పుడు నెల్లూరుకు ముందు ఒకెత్తయితే.. నెల్లూరు తరువాత మరో ఎత్తని వైసీపీలో చర్చించుకుంటారు. నెల్లూరు తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జనవాహినిలా సాగిందట. ఇక ఎన్నిక ఏదైనా.... ఫలితాల్లో సొంత జిల్లా కంటే ఏ రకంగా తీసిపోని విధంగా నెల్లూరోళ్లు అండగా ఉంటున్నారట. అందుకే నెల్లూరు జిల్లాపై జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానమంట. అయితే ఇదంతా ఒకనాటి మాటేనంటూ కొట్టి పారేస్తున్నారట వైసీపీ నేతలు. రాయలసీమ, కోస్తా జిల్లాల కలయికైన నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా తయారయ్యారని సొంతపార్టీలోనే చర్చించుకుంటున్నారు.

ఒక ఎమ్మెల్యేకి, తీసిపోని విధంగా మరొక ఎమ్మెల్యే... తమ తమ నియోజకవర్గాల ప్రజలను పీల్చుకు తింటున్నారట. ఎవరి స్టయిల్లో వాళ్లు.. చేతివాటం ప్రదర్శిస్తున్నారట. ఇంటలిజెన్స్ సమాచారం చేతిలో పెట్టుకున్న సీఎం జగన్... ఒక్కొక్కరిని పిలిచి పద్ధతి మార్చుకోవాలని తలంటుతున్నారట. ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారో.. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారట. వీలైన దగ్గర పార్టీకి పడిన పంచర్లకు అతుకులేసేందుకు ప్రయత్నిస్తున్నారట. కొన్ని దగ్గర్ల పార్టీకి జరిగిన డ్యామేజీపై పోస్టుమార్టం చేసుకుంటున్నాడట జగన్మోహన్ రెడ్డి.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీంలు, వారు చెప్పినట్టే అధికారులు నడుచుకోవాలంటూ గతంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హుకూం జారీ చేశాడు. దొరికిందే ఛాన్స్ అన్నట్టు నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్టు వారు చేతివాటం ప్రదర్శించడం మెదలు పెట్టారట. నియోజకవర్గాన్ని వెనక్కు తీసుకోవడానికి కానీ, జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేని స్థాయికి తీసుకుపోయారట. చేతులు కాలిన తరువాత చూసుకున్న జగన్మోహన్ రెడ్డి... పాలనను తిరిగి గాడిలో పెట్టేందుకు ఓ ప్లాన్ వేశాడట. చాలాకాలం క్రితమే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చే పనిలో పడ్డాడట. ఇది తెలియని ఎమ్మెల్యేలు యధారాజా.. తదా ప్రజా అన్నట్టు తమ సహజత్వాన్ని కొనసాగించడంపై పూర్తి సమాచారం ముఖ్యమంత్రి టేబుల్ పై ఉందట.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరిని పిలిచి పద్ధతి మార్చుకోవాలని సూచిస్తుండటంతో మిగిలిన ఎమ్మెల్యేలు భుజాలు తడుముకోవడం మెదలు పెట్టారట. నేడోరేపో జిల్లాలో చాలామంది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పోయిరావాల్సి వస్తుందన్న సమాచారం వినబడుతుంది. అంతేకాదు అతి త్వరలోనే వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పట్టిన గతే మిగిలిన ఎమ్మెల్యేల్లో చాలా మందికి పట్టనుందనే చర్చ జరుగుతోంది. సమన్వయకర్తల పేరుతో నియోజకవర్గాల్లో ఇతర నేతలను చొప్పించే పనిలో పడ్డాడట జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్న చోట్ల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి... ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ శ్రీకారం చుట్టబోతున్నారట.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని చొప్పించారు. పొమ్మనకుండానే పొగపెట్టి ఆనం మాటకు విలువివ్వాల్సిన అవసరం లేదని అధికారులకు ఆదేశాలిచ్చారు. కీలకమైన ఆనం ముద్రపడిన అధికారులను బలవంతంగా బదిలీలు చేశారు. గడపగడపకు ప్రభుత్వం చాలించాలన్న సూచనలిచ్చారు. ఇలా ఆనం పవర్స్ ను ఒక్కొక్కటిగా కట్ చేసి బటయకు పంపే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఇదే విధానాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, ఉదయగిరి, కావలి, కోవూరు నియోజకవర్గాలతో పాటు మరో ఒకటిరెండు నియోజకవర్గాల్లో చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. కాబట్టి పవరు లేదు... రేపు సీటు ఉంటుందన్న నమ్మకం లేని దగ్గర ఉండటం కంటే బయటకు పోవడమే మేలన్న నిర్ణయానికి సిట్టింగులు వచ్చేస్తారు. సో ఇదన్నమాట జగన్ అన్నయ్య ప్లాన్. ఇలా ఎన్నికలకు ఏడాది ముందే నియోజకవర్గాన్ని సెట్ చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నాడట జగన్మోహన్ రెడ్డి. చూడాలి మరి అధికార పార్టీలో మెదలైన స్పై వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారి పార్టీని ఏ స్థితికి తీసుకుపోతుందో.

Tags

Read MoreRead Less
Next Story