Editorial: విశాఖ కేంద్రంగా హాట్ హాట్ పాలిటిక్స్

Editorial: విశాఖ కేంద్రంగా హాట్ హాట్ పాలిటిక్స్
ఆ నియోజకవర్గంపైనే ఏపీ బీజేపీ కీలక నేతల కన్ను..! పార్లమెట్ సీటుపై ప్రధాన పార్టీల కన్ను; సై అంటే సై అంటున్న బీజేపీ ముఖ్య నాయకులు; టిక్కెట్ ఎవరికి దక్కనుందనే దానిపై ఉత్కంఠ; ప్రతిపక్షాలకు వరంలా అధికారపార్టీ విభేదాలు

విశాఖ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పుడు అన్ని పార్టీల కన్ను... విశాఖ పార్లమెంటుపైనే పడిందట. సీటు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులంతా ఓ రేంజ్ లో ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా బీజేపీలోని ముఖ్య నాయకులంతా విశాఖపట్నం ఎంపీ సీటు పైనే గురి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, స్థానిక నాయకులు విష్ణుకుమార్ రాజు... ఇలా లీడర్లంతా ఒకే సీటు కోసం తెగ తాపత్రయ పడుతున్నారాట. మరి ఆ సీటుకే ఎందుకంత డిమాండ్ అనేది.. ఇపుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో బలపడదామని ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి సారించిందట. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విశాఖపట్నంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. కొంత కాలంగా ఆయన వరుస పర్యటనలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. మొన్నట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చిన మోదీ... రాష్ట్ర నాయకత్వంతో సమావేశమై పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు అభిృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విశాఖకు వచ్చిన ప్రధాని... అప్పుడు కూడా రాష్ట్రంలోని కీలక నాయకులతో భేటీ అయ్యారు. జగన్ సర్కారు వైఫల్యాలపై పోరాటం ఉధృతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. జగన్ బీజేపీ అనుకూలమనే ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టి... దూకుడుగా వ్యవహరించాలని స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక త్వరలో జరగబోయే జీ20 సమావేశాలకు సైతం విశాఖే వేదిక కాబోతోంది. ఈ రకంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు వైజాగ్ కు రాబోతున్నారు.

విశాఖపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంపై పలు ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాది ప్రజల ప్రభావం విశాఖపై ఎక్కువగా ఉండటమే..ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్ ఉండటంతో ఇందులో పనిచేసే వారంతా ఎక్కువగా ఉత్తరాది ప్రజలే. సో నార్త్ ఓటు బ్యాంకే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోందట.అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ఓట్లు కూడా విశాఖలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ప్రశాంతనగరంలో పట్టు సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గ్రహించే.. అగ్రనాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందట.

జాతీయ నాయకత్వం విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించడంతో.. ఇదే ఊపులో ఆశావహులు సైతం తమ సత్తా చాటేందుకు ఉవ్విల్లూరుతున్నారు. విశాఖ పార్లమెంటు బరిలో నిలిచేందుకు సై అంటే సై అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ నాయకురాలిగా ఉన్న పురందేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇక్కడి నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మిజోరం గవర్నర్ గా కొనసాగుతున్న కంభంపాటి హరిబాబు సైతం ఇక్కడ ఎంపీగా గెలిచినవారే. ప్రస్తుతం బీజేపీకి విశాఖలో పట్టు లేనప్పటికే... గతంలో పోటీచేసి గెలిచిన అభ్యర్థుల అనుభవం పార్టీకి తోడవుతుందని అధినాయకత్వం భావిస్తోందట. ఏపీలో పట్టు పెంచుకోవడానికి విశాఖ కేంద్రంగా రాజకీయం నడపాలనే ఉద్దేశంలో ఉందట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకులు సైతం ఇక్కడి నుంచి పోటీ చేయడం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారట. చూడాలి మరి విశాఖ ఎంపీ సీటు ఎవరిని వరించబోతోందో. అటు అధికారపార్టీలో ఉన్న వర్గ విభేదాలు ప్రతిపక్షాలకు వరంలా మారాయి. భుకబ్జాలు, అవినీతి ఆరోపణలు, పార్టీలో కుమ్ములాటలతో విశాఖ వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులెవరైనా ఈసారి సిట్టింగ్ ఎంపీ సీటు గల్లంతే అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story