Editorial: వెంకటగిరిలో నేదురుమల్లి "కక్షా రాజకీయం"?

Editorial: వెంకటగిరిలో నేదురుమల్లి కక్షా రాజకీయం?
ప్రతీకారం మొదలెట్టిన నేదురుమల్లి; ఒక్కొక్కరిగా ఆనం అనుచరులకు చెక్; అధికారుల్లోనూ రాంకుమార్ రెడ్డి అలజడులు; తర్వాత బలయ్యేది ఎవరనే ఆందోళన


వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నియోజకవర్గ ప్రక్షాళన చేపట్టాడు. మూడేళ్ళుగా తనకు దక్కని గౌరవాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తున్నాడట. నిన్నమొన్నటి వరకు రాంకుమార్ రెడ్డిని కనీసం గౌరవించని అధికారుల భరతం పడుతున్నాడట నేదురుమల్లి. అటు రాజ్యాంగ బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఒక వైపు.. ఇటు అధికార పార్టీ నియమించిన సమన్వయకర్త మరోవైపు. ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదో తెలియక అయోమయంలో ఉన్నారట వెంకటగిరి ప్రభుత్వ అధికారులు. ప్రజా ప్రతినిధిగా ఆనం చెప్పిన పనిచేస్తే రాంకుమార్ రెడ్డి కస్సుమని లేస్తున్నాడు. చేయకపోతే ఎమ్మేల్యే చెబితే చేయవా అంటూ ఆనం గద్దిస్తున్నాడట. దీంతో ఎటూ పోలుపోని పరిస్థితైపోయిందట అధికారులది.

వెంకటగిరికి ఎమ్మెల్యేగా ఆనం గెలుపొందిన తరువాత తన అనుకూలస్తులను అధికారులుగా వేయించుకున్నాడు. దీంతో ఆనం మాటకు విలువిచ్చి కొందరు అధికారులు పనులు చేయడంతో, రాంకుమార్ రెడ్డి మాట కాదని ఆనం మాట విన్నందుకు ఒక్కొక్కరిపై వేటు పడిందట. దీంతో ఎప్పుడు తన వంతు వస్తుందోనని మిగిలిన అధికారులు టెన్షన్ పడుతున్నారట. ఇది కేవలం ప్రభుత్వ అధికారులకే కాదు.. పార్టీ నాయకులకు కూడా కత్తి మీద సాములా మారిందట.

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వెంకటగిరి సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తరువాత మెట్టమెదటగా వేటు పడింది మున్సిపల్ కమిషనర్ పైన. గంగా ప్రసాద్ ను రాంకుమార్ రెడ్డి బదిలీ చేయడంతో వెంకటగిరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మెదటి నుండి ఆనం వర్గానికి నేదురుమల్లి వర్గానికి మధ్య కౌన్సిల్లో మాటల యుద్ధం సాగుతూనే ఉంది. మున్సిపల్ ఛైర్మన్ గా ఆనం నియమించిన మనిషితో పాటు కౌన్సిల్లోని 25మంది సభ్యుల్లో 16 మంది ఆనం వర్గం కాగా.. మిగిలిన 9మంది నేదురుమల్లి వర్గంగా కొనసాగింది. నేదురుమల్లి వర్గీయులకు పనులు జరగట్లేదని సమావేశంలో గొడవలకు దిగిన సందర్భాలు అనేకం. పోలీసు బందోబస్తు పెట్టిమరీ సమావేశం నిర్వహించిన సందర్భమూ లేకపోలేదు. మున్సిపల్ కమిషనర్ ఆనం నియమించిన వ్యక్తి కావడంతో.. ఆయన వర్గానికే పనులు జరిగేవన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాంకుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే వెంకటగిరి కమిషనర్ గంగా ప్రసాద్ స్థానంలో వెంకట రామయ్యకు పోస్టింగ్ వేయించారు. పోస్టింగ్ అందుకున్న వెంటనే స్వామి భక్తి చాటుకున్నాడు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య. తాను రామ్ కుమార్ రెడ్డి చెబితేనే పనిచేస్తానని అధికారుల ముందే బహిరంగ ప్రకటన చేశాడు.

కమిషనర్ తరువాత ఆనం కంచుకోట రాపూరు మీద పడ్డాడు రాంకుమార్ రెడ్డి. రాపూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు ఆనంకి నమ్మిన అధికారి. వెంకటగిరిలో రెండు సంవత్సరాలు సీఐగా ఆనంకు అనుకూలంగా పనిచేసి.. జిల్లాల విభజన తర్వాత రాపూర్ సర్కిల్ లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని పట్టు పట్టారు. దీంతో సీఐకి రాపూరు సర్కిల్ బాధ్యతలు ఆప్పగించారు ఆనం. వెంకటగిరి, రాపూర్ లలో నేదురుమల్లి ఎప్పుడు పర్యటించినా... సీఐ ఆయనకి ఎస్కార్ట్ ఏర్పాటు చేయలేదు. పోలీస్ బందోబస్తు పెట్టలేదు. ఎప్పుడూ వెళ్లి కలిసిందీ లేదు. దీంతో ఆగ్రహించిన రామ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి నాగమల్లేశ్వరరావుని బదిలీ చేయించారని ప్రచారం జరుగుతోంది.

వెంకటగిరిలో పోలేరమ్మ తరువాత అంతటి ప్రసిద్ధిగాంచిన క్షేత్రం పెంచలకోన శ్రీ పెను శిలా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఆలయ ఛైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి ఆనం సన్నిహితుడు. చిన్నపాటి నాయకులు వచ్చినా పూర్ణకుంభాభిషేకంతో ఆహ్వానం పలికే ఈవో వెంకటసుబ్బయ్య... నేదురుమల్లి కార్యకర్తలతో కలిసి దర్శనంకు వస్తే సెలవు పెట్టి వెళ్ళిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా రెండోసారి దర్శనానికి వస్తే ఆహ్వానం పలక్కపోగా ఆఫీసు రూములకి తాళాలు వేశారని రాంకుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సందర్భం ఉంది. మళ్లీ వస్తే అధికారంతోనే వస్తాను, అందరి పని చెప్తాను అని ఆనాడే శపథం పూని వెళ్లారు రాంకుమార్ రెడ్డి. అనుకున్నట్టుగానే వెంకటగిరి ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టడంతోనే మూడో బదిలీగా ఈవోను పంపించేశాడన్న ప్రచారం జరుగుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలో మరింత మంది సిబ్బంది మార్పులు జరగుతాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో మిగతా అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.

తాజా పరిణామాలతో అధికారులే కాదు.. ఆనం అనుచరులు సైతం రాంకుమార్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడుతున్నారట. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండడంతో వెంకటగిరి వైసీపీలో ఉంటూ ఆనం వెంట నడిచిన వారు, తమ భవిష్యత్తు ఏంటనే ఆలోచనలో పడ్డారట. ఇక్కడ నుంచి ఆనం పోటీ చేయరని తెలుసుకున్న ఆయన అనుచరులు... నేదురుమల్లి వర్గంలోకి వెళ్లిపోతున్నారట. ఇందుకు కారణమూ లేకపోలేదు. ఇటీవల చేసిన పనుల బిల్లులు పెండింగ్ ఉండడంతో రాంకుమార్ రెడ్డి అడ్డుకట్ట వేస్తారనే భయంతో... పార్టీ వీడకుండా ఆనంను వీడి నేదురుమల్లి వర్గంలో చేరుతున్నట్టు టాక్. అయితే ఇది కేవలం అధికార హోదాలో చేస్తున్నాడు తప్ప నాయకుడిగా రాంకుమార్ రెడ్డికి అంత బలం లేదన్న వాదన నియోజకవర్గంలో గట్టిగానే వినిపిస్తోంది. రేపు అధికారం పోతే వెంకటగిరిలో రాంకుమార్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడుగానే చూస్తారంటున్నారట ఆనం వర్గం.

Tags

Read MoreRead Less
Next Story