Editorial: "నెల్లూరు జనసేనలో టిక్కెట్ వార్"

ఎన్నికలు ఏపీ దశాదిశా మార్చనున్నాయన్న విషయం విదేతమే. రాబోయే ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకే కాదు.. కొత్త పార్టీలకు కూడా చావోరేవో అన్నట్లుగానే పరిస్థితులున్నాయి. అందుకే అన్నిపార్టీల నేతలు కాళ్లకు చక్రాలు కట్టుకుని ఎండనక, వాననక తిరుగుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతను భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాయి. బలహీనంగా ఉన్న నేతలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి తప్ప.. వర్గపోరుకు, ఆధిపత్య పోరుకు తావివ్వడం లేదు. ఇంత చేస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు తిప్పలు తప్పడంలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన వారే శాసనసభ్యులుగా ఉన్నారు. వైసీపీ ఎమ్మేల్యేల అరాచకాలను ప్రతిపక్ష నేతలు ధీటుగానే ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రతిఘటన తట్టుకోలేని అధికార పార్టీ.. డజన్ల కొద్ది కేసులు పెడుతోంది. అయినా జడవకుండా ప్రజా సమస్యలపై సోమిరెడ్డి, బీదా రవిచంద్ర, అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దినేష్ రెడ్డి లాంటి వారు గళమెత్తుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో జనసేన కాస్తోకూస్తో బలంగా కనబడుతోంది నెల్లూరు నగరంలోనే. కానీ ఇక్కడ జనసైనికుల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయట. ఇదే ఇప్పుడు అధికార పక్షానికి ఆయుధంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.
నెల్లూరు నగరంలో ఎక్కువ సార్లు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే గెలిచారు. 2009లో ఒక్కసారి మాత్రం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అభ్యర్ది గెలుపొందడంతో నెల్లూరు నగరంలో కొణిదెల కుటుంబానికి కొంత అనుకూల పరిస్థితులు ఉన్నట్టు స్పష్టమైంది. దీంతో నాటి నుండి అది ప్రజారాజ్యం కావచ్చు, జనసేన కావచ్చు.... కొణిదెల కుటుంబానికి మద్దతుగా క్యాడర్ బయటకు వచ్చి పోరాడుతోంది. 2019 నెల్లూరు నగరం నుండి జనసేన అభ్యర్ధి రేసులో ఉండటంతో స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. నాటి ఎన్నికల్లో జరిగిన త్రికోణ పోరులో జనసేన కాస్త గౌరవప్రదమైన ఓటు బ్యాంకు సంపాధించుకుంది. అయితే 2019లో నెల్లూరు నగర సీటు కోసం లేని పోటీ.. 2024కి వచ్చి పడిందట. జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు నగరానికి 2019లో పోటీ చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి పోటీ పడుతున్నారట. ఎవరికి వారు నేనంటే నేనంటూ ప్రచారం చేసుకుంటున్నారట. నెల్లూరు నగరం నుండి నేనే జనసేన అభ్యర్ధిని అని చెప్పుకుంటున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఏడాది కాలంగా పవనన్న ప్రజాబాట పేరుతో తిరుగుతున్నాడు.
ఇటు నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి.. ప్రభుత్వ పాలనలో ప్రజల బతుకు భారం... పోస్టర్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకున్నాడు. పార్టీ ఆదేశిస్తే నగరం నుండి పోటీకి సిద్ధమంటూ చేసిన ప్రకటన నెల్లూరు అధికార పార్టీని తాకింది. మనుక్రాంత్ రెడ్డి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. మైకులు కనిపిస్తే ప్రజలు అసహ్యించుకునే విధంగా మాట్లాడటం అనిల్ కు అలవాటైపోయిందని.. గడిచిన 9 ఏళ్లలే నెల్లూరుకు ఏం చేశావని నిలదీశాడు. మనుక్రాంత్ రెడ్డి విమర్శలపై అనిల్ నోటికి పని చెప్పాడు. ఎన్నికలంటే చుట్టపు చూపుగా నాలుగేళ్లకు ఒకసారి ప్రజల ముందుకు వచ్చి కనబడటం కాదు.. మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు నగర బౌండ్రీస్ తెలుసుకునే సరికి ఏడాది పడుతుందని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో ఒకడు ఏడాది కాలంగా బికారిగా తిరుగుతున్నాడు. మరోకడు నేనే జనసేన అభ్యర్ధిని అంటు వస్తున్నాడు. ఎవరొచ్చినా నేను పోటీకి సిద్ధమంటూ సవాల్ విసిరాడు.
నిన్నమెన్నటి వరకు అంతర్గతంగా ఉన్నా జనసేన ఆధిపత్య పోరు.. నెల్లూరు అనిల్ స్పందనతో బట్టబయలు అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తుల్లో జనసేన తనమీద పోటీ చేసినా సిద్ధంగా ఉన్నాను అంటు అనిల్ చేసిన ప్రకటనతో నెల్లూరు నగర ఓటర్లు ఆలోచనలో పడ్డారు. జనసేనలో ఉన్న విభేదాల కారణంగా జనసేన కంటే... నెల్లూరు నగరం నుండి మాజీమంత్రి పొంగూరు నారాయణ బరిలో నిలిస్తే తిరుగులేని విజయం ఖాయమన్న టాక్ నడుస్తోంది. జనసేన ఆధిపత్య పోరు కారణంగా పొత్తులో ఏ ఒక్కరికి సీటు కాదన్నా మరొకరు ఎదురు తిరగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. 2009 తరువాత మరోసారి పొత్తులో నెల్లూరు నగరం జనసేన చేజిక్కించుకునే అవకాశం ఉన్న తరుణంలో.. ఆధిపత్యపోరు విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి జనసేనాని నెల్లూరు నగరంపై దృష్టి సారించకపోతె భారీ మూల్యం తప్పదంటున్నారు జనసైనికులు. అటు అధికార పార్టీతో విసిగిపోయిన నెల్లూరు ప్రజలు సైతం.. ఆధిపత్యపోరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com