Editorial: "నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డిని కొట్టేవాడున్నాడా?"

Editorial: నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డిని కొట్టేవాడున్నాడా?
రసవత్తరంగా నెల్లూరు రూరల్ రాజకీయం; నియోజకవర్గానికి ఆదాల సెక్యూరిటీ గార్డేనా? ఎన్నికల బరిలో ఉండబోయేది కొత్త ముఖమా? ఇకనైనా వైసీపీలో ఉంటాడా.. బీజేపీ, జనసేన అంటాడా? రూరల్ లో కోటంరెడ్డిని ఢీ కొట్టేవాడున్నాడా?


రెడ్డి రాజకీయాలకు నెల్లూరు జిల్లా కంచుకోట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో రెండు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నప్పటికీ అక్కడ కూడా రెడ్డిగార్ల అభిప్రాయాల మీదే అభ్యర్థుల ఎంపిక ఆధారపడి ఉంటుంది. నెల్లూరు జిల్లా రాజకీయాలను అంతగా ప్రభావితం చేస్తారు పెద్దా రెడ్లు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో వారు వీరౌతుంటారు.. వీరు వారౌతుంటారు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయమే వేరు. పార్టీలు మారినా... తిరిగి వారే గద్దెనెక్కుతారు. 2019 ఎన్నికల్లో నాటి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, టీడీపీ నుంచి బరిలో దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డి అలర్ట్ చేశాడు. ఇప్పుడు అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి 2024 ఎన్నికలకు వైసీపీ నుండి బరిలోకి దిగుతూ శ్రీధర్ రెడ్డిని ఢీ కొట్టబోతున్నాడు. ఇలా తలకిందులైంది నెల్లూరు రూరల్ రాజకీయం.

2019 ఎన్నికలపుడు ప్రతిపక్షంలో ఉండటంతో సంపన్నుడైన ఆదాలపై పోటీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాస్త సంసయించినట్టు వినికిడి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మొన్న జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో రూరల్ పరిధిలోని 26 డివిజన్లను, మండల పరిధిలోని 18 పంచాయితీలను క్లీన్ స్వీప్ చేసుకున్నారు కోటంరెడ్డి. నియోజకవర్గం మెత్తాన్ని ఒకటికి నాలుగు సార్లు చుట్టేసి తన హస్తగతం చేసుకున్నాడు. 2019లో ఆదాల ఆఖరి క్షణంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిని వెతుక్కునే అవకాశం కూడా ఇవ్వకుండా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. నాడు ఎంతో ఆశగా, నమ్మకంగా ఎదురు చూసిన రూరల్ ప్రజలను మోసం చేసిన ఆదాల.... నేడు మరోపార్టీ నుండి బరిలోకి దిగుతున్నాను అంటే వారు నమ్ముతారా అన్నది సమాధానం దొరకని ప్రశ్న.

అప్పుడు ఆదాలను తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీదకు పోటీకి పంపినా.. నేడు వైసీపీ అదే ఆదాలను తిరిగి శ్రీధర్ రెడ్డి మీదకు పోటీకి పంపినా ఒకటే కారణంగా కనిపిస్తోంది. ఆర్థికంగా బలవంతుడు.. ఎన్నికల్లో డబ్బును ఏరులై పారిస్తాడన్న పేరు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఓ విషయాన్ని ఆదాల మరచిపోతున్నాడు. నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మెదటిసారి గెలిచి రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలో ఉన్న శ్రీధర్ రెడ్డికి.. ఇప్పుడు అధికార పార్టీలో నాలుగేళ్లు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ రెడ్డికి తూర్పుపడమరకు ఉన్నంత తేడా ఉంది. అంతగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బలపడ్డాడు. అందులోనూ ఆదాలకున్న మాయని మచ్చి... చివర వరకు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికి తెలియదు. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆదాల... మంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీనే తొక్కి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఉంటాడులే కాంగ్రెస్ పార్టీలో అనుకునేలోపు తిరిగి టీడీపీ పంచన చేరాడు. ఇకనైన కుదురుగా ఉంటాడులే అనుకునేలోపు ఊహించని విదంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇప్పుడైనా వైసీపీలో చివరి వరకు ఉంటాడా లేక వారికీ ఝలక్ ఇచ్చి ఏ జనసేనో, లేకపోతే బీజేపీనో అంటాడా అంటూ నెల్లూరు ప్రజలు జోకులేసుకుంటుంటున్నారట.

ఆదాల ప్రభాకర్ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో ఓ పుకారు షికారు చేస్తోంది. ఆదాల అనే వ్యక్తి రూరల్ నియోజకవర్గానికి ఏడాదిపాటు సెక్యూరిటీ గార్డు మాత్రమేనని.. ఎన్నికల నాటికి అధిష్టానం ఏదో ఒక కొత్త ముఖాన్ని తెరమీదకు తీసుకొస్తుందన్న చర్చ నడుస్తోంది. ఇందుకు కారణమూ లేకపోలేదు. ఆదాల ఇప్పటికే 70 ప్లస్ కావడం, ఆ పార్టీ, ఈ పార్టీ అంటు మారడంతో నమ్మకమైన క్యాడర్ లేదు. మరీ ముఖ్యంగా వయో భారం ఆదాల ప్రభాకర్ రెడ్డిని వెంటాడుతోందట. దీంతో ఏడాది కాలం పాటు నియోజకవర్గాన్ని కాపలా కాచి.. చివరకు ఎవరికి చెబితే వారికి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటాడన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో ఆదాలతో వైసీపీ రాసుకోని ఒప్పందంగా తెలుస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు విజేతలో ఎవరు పరాజితులో తెలుసుకోవాలంటే ఏడాది ఆగాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story