Editorial: "మంత్రిలా ఫీల్ అయిపోతున్న బొత్సా తమ్ముడు!"

రాజకీయంగా వైసీపీకి పట్టం కట్టిన విజయనగరం జిల్లాలో.. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఉన్న తొమ్మిది మందిలో గజపతినగరం ఎమ్మెల్యే బొత్సా అప్పలనరసయ్య ఒక అడుగు ముందుకేసి భూ సమస్యల పరిష్కారం ముసుగులో కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్ లు చేస్తున్నారట. భూ సమస్యలు ఏదో న్యాయంగా పరిష్కారం చూపుతున్నారంటే మీరు కబ్జా ల్యాండ్ లో కాలేసినట్టే. 50-50 కమీషనైనా ఉండాలి, లేకపోతే ఏదో ఒక పార్టీని భయపెట్టి తక్కువ రేటుకే అతనికి చెందిన వాటా భూమి కొనుగోలు చేయాలి. ఇది గజపతినగరం నియోజకవర్గంలో జరుగుతోంది.
గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో గజపతినగరం నియోజకవర్గం విస్తరించి ఉంది. ఈ నాలుగు మండలాల్లో కొన్ని వందల ఎకరాలను పోగు చేసుకుంటూ భూసామిగా పేరు గాంచారు ఎమ్మెల్యే బొత్సా అప్పల నరసయ్య. ఈ భూములు ఎలా వస్తున్నాయి. ఏం చేస్తున్నారు అన్న దానిపై ఇంటిలిజెన్స్ అధికారుల నిఘానేత్రం పడిందంటే మనోడు చేసిన ఘనత ఎలాంటిదో చూడండి.
గజపతినగరం మండల కేంద్రంలోని దిగువ వీధిలో ఎమ్మెల్యేకి కొంత ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ కి సరైన రహదారి లేకపోవడంతో పక్కనే ఉన్న ఓ షావుకారుకి చెందిన భూమిని లాక్కొని రహదారికి వాడేసుకున్నారట. అంతే కాకుండా గజపతినగరం నుండి దత్తిరాజేరు వరకు ఉన్న తన భూముల విలువును పెంచుకోవడం కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారట. అవసరం లేకపోయినా ఆ మార్గం గుండా బైపాస్ రోడ్డును వేయించుకున్నారట. వాస్తవానికి ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్ సరిపోతుందని.. కానీ ప్రత్యేకంగా డబుల్ రోడ్డు వేయించుకుని భూములకు వాల్యూ పెంచుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల గజపతినగరం టౌన్ కి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములు భూ తగాదా నిమిత్తం ఎమ్మెల్యేని ఆశ్రయిస్తే సెటిల్మెంట్ పేరుతో కొంతమొత్తం చెల్లించి వారి భూమిని కొనేశారట.
గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలంలో చినకాద రెవెన్యూ పరిధిలోని ఒక కొండ పక్కన మొదటగా తన పార్ట్ నర్ రాజు చేత కొంత భూమిని కొనిపించారట ఎమ్మెల్యే బొత్సా అప్పలనరసయ్య. అనంతరం ఆ కొండ పక్కన ఉన్న రైతులకు సంబంధించిన 40 ఎకరాల లిటిగేషన్ భూమి తనకు కావాలంటూ బెదిరింపులకు దిగారట. ఎమ్మార్వోల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆ పని తాము చేయలేమంటూ దండం పెట్టేశారట. దీంతో రెండేళ్లలోనే ఐదుగురు ఎమ్మార్వోలు ట్రాన్స్ ఫర్ ఐపోయారట. ఈ నియంత పాలనలో తాము పని చేయలేమంటూ అధికారులు గగ్గోలు పెడుతున్నారట. మరోవైపు అదే మండలంలో కోరపు కొట్టవలసలో నలుగురు అన్నదమ్ముల వాటాకు సంబంధించిన 16 ఎకరాల భూమిలో 12 ఎకరాలు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే... మిగిలిన 4 ఎకరాలు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నారట. దీనిపై అందులో ఒక వాటాదారుడైన కోరపు కొత్తవలస టీడీపీ వైస్ సర్పంచ్ రాంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వాటాకు భూమిని తక్కువ ధరకే అమ్మేయాలని లేకపోతే లిటిగేషన్ పెట్టించి ఆ భూమి కూడా చెందకుండా చేస్తానని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.
ఎక్కడైనా లిటిగేషన్ భూమి కనిపిస్తే చాలు 50-50 కమీషన్ గాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను గానీ ఎరవేస్తూ... ఎమ్మెల్యే బొత్సా అప్పలనరసయ్య తన భూ దాహాన్ని తీర్చుకుంటున్నాడని సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారట. దీనికి ఉదాహరణే బొండపల్లి మండలకేంద్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఒకరిని నియమించడం అంటున్నారు. గజపతినగరం మండలకేంద్రంలో అంగన్ వాడి కేంద్రంలోనూ ఓ టీచర్ ను నియమించారట. మరోవైపు అంజిపురానికి ఆనుకుని ఉన్న సుమారు 4 ఎకరాల భూమిని స్థానిక నాయకుల సహకారంతో మార్కెట్ రేటుకంటే తక్కువకే కొనుక్కుని ప్లాట్లకు అనుమతులు తీసుకున్నారట. ఇక్కడితో ఆగకుండా చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను స్థానిక లీడర్లతో తక్కువ ధరకు కొనుగోలు చేయడం. ఒకవేళ రైతులు అమ్మకపోతే వారిని చెప్పలేని ఇబ్బందులకు గురి చేస్తున్నారట. గజపతినగరం మండలం గంగచోళ్లపెంటలో కనకల మురళి అనే వ్యక్తి లే ఔట్ పై మనోడి కన్నుపడటంతో అతన్ని సైతం బెదిరింపులకు గురిచేశారట.
ఒక్క భూ వ్యవహారమే కాకుండా అక్రమ ఇసుక వ్యవహారంలోనూ తనవంతు మార్కును చూపిస్తూ లక్షలు వసూలు చేస్తున్నాడట ఎమ్మెల్యే బొత్సా అప్పలనరసయ్య. చంపావతి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతూ సాహో అనే ప్రైవేటు కంపెనీకి అనుచరుల చేత తరలిస్తున్నారట. గజపతినగరం మండలం మరుపల్లిలో ఉన్న కొండపై ఎటువంటి అనుమతులు లేకుండా వందలకొద్దీ ట్రాక్టర్లతో మైనింగ్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారట. ఇదంతా రాత్రిపూట జరగడం, తన బినామీల చేతే చేయించడంతో సొంతపార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారట. గంట్యాడ మండలానికి చెందిన వేమల ముత్యాలనాయుడు అనే వ్యక్తికి మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారట. కొంతకాలం తర్వాత ఆ పదవిని వేరొకరికి ఇస్తానని హామీ ఇచ్చారట. సమయం వచ్చిందని ఆశావహులు వెళ్లి అడగ్గా మార్చేది లేదంటూ చెప్పేశారట ఎమ్మెల్యే. దీంతో వారందరూ నిరాశగా ఉన్నారట. ఇలా వైసీపీ నాయకులు కూడా తమకు ఏ రకంగానూ ఎమ్మెల్యే ఉపయోగపడటం లేదని... తప్పక పార్టీలో ఉంటున్నామని ఆవేదన చెందుతున్నారట. 2009 కి 2019 కి ఆయనలో చాలా మార్పు వచ్చిందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. అంతా తానై వ్యవహారించడంతో ఎమ్మెల్యే ముందు భజనలు చేసినా వెళ్లిన వెంటనే తిట్టుకుంటున్నారట.
ఎమ్మెల్యే బొత్సా అప్పలనరసయ్యది పేరుకే గజపతినగరం సొంత నియోజకవర్గం అంట. కానీ సొంత ఇల్లు కూడా లేకపోవడం, ఉదయం వచ్చి వెళ్లిపోవడమే తప్ప ఒక్కరోజు కూడా ఉండడంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కార్యకలాపాలు మొత్తం విజయనగరం నుండే చేస్తారంటూ మండిపడుతున్నారట. దీనికి తోడు గత ఐదునెలల కిందట సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చిందట. తీరా అక్కడకి వెళ్లే సరికి టేబుల్ పై భూ భాగోతం ఫైల్ పెట్టి ఇదేంటని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇదిలా ఉండగా పనితనం బాగోలేదని ఈమధ్య ఐ ప్యాక్ టీమ్ ఇచ్చిన సర్వేలో కూడా మనోడు ఏడో స్థానంలో ఉండటంతో సీరియస్ అయ్యారట జగన్. ఇలానే ఉంటే మీ స్థానంలో కొత్తవారు వస్తారంటూ హెచ్చరించారట.
ఇది మన గజపతినగరం వైసీపీ ఎమ్మెల్యే, బొత్సా తమ్ముడు అప్పల నర్సయ్య వ్యవహారం. మంత్రిగారి తమ్ముడు కూడా మంత్రిగానే ఫీలైపోయి ఇలా చేస్తున్నాడట. ఇప్పటికైనా బెదిరింపులు, కమీషన్లు వ్యవహారం పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారట. లేకపోతే మాత్రం జన సునామీలో కొట్టుకుపోవడం గ్యారెంటీ అంటున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com